సంక్రాంతి రేసు.. డిస్ట్రిబ్యూటర్లకు అసలైన పరీక్ష!
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం మరో ఫెస్టివల్ సీజన్ కాదు. ఏడాదిలోనే అత్యంత విలువైన బాక్సాఫీస్ విండోగా ఇది మారిపోయింది.
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం మరో ఫెస్టివల్ సీజన్ కాదు. ఏడాదిలోనే అత్యంత విలువైన బాక్సాఫీస్ విండోగా ఇది మారిపోయింది. ఫెస్టివల్ హాలీడేస్, ఫ్యామిలీతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్, విదేశాల్లోని తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చే మంచి రెస్పాన్స్ కలిసి ఈ సీజన్‌కు స్పెషల్ మార్కెట్‌ను తీసుకొచ్చాయి. అందుకే దాదాపు ప్రతి పెద్ద నిర్మాణ సంస్థ తమ ప్రిస్టీజియస్ ప్రాజెక్టును ఈ టైమ్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్స్ రెడీ చేస్తోంది.
గతంతో పోలిస్తే ఇప్పుడు సంక్రాంతి మార్కెట్ పరిధి గణనీయంగా విస్తరించింది. ఒకప్పుడు రెండు పెద్ద సినిమాలు వస్తే చాలనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నాలుగు లేదా ఐదు భారీ సినిమాలు ఒకే సీజన్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం సాధారణంగా మారుతోంది. థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్ వాల్యూ, ఓటీటీ డీల్స్ అన్నీ కూడా పండగ రిలీజ్‌లకు అనుకూలంగా ఉండటంతో నిర్మాతలు ఈ సీజన్‌ను వదులుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అంతేకాదు, సంక్రాంతి క్రమంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల సీజన్‌గా మారుతోంది. సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే కథలు, కామెడీ, ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు బ్యాలెన్డ్స్‌గా ఉండే సినిమాలకే ఈ సీజన్‌లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా పండగ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ పోటీ నిర్మాతలకంటే ఎక్కువ ఒత్తిడిని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లపై మోపే అవకాశం ఉంది. ఒకే సమయంలో పలు పెద్ద సినిమాలు రిలీజ్ లకు రెడీ అయితే ముందుగా ఎదురయ్యే సమస్య థియేటర్ల లభ్యత. ప్రతి సినిమాకీ బెస్ట్ స్క్రీన్స్ కావాలనే డిమాండ్ ఉంటుంది. కానీ అందరికీ ఒకేసారి అదే స్థాయిలో థియేటర్లు కేటాయించడం సాధ్యం కాదు. ఫలితంగా స్క్రీన్ షేరింగ్‌పై డిస్కషన్స్, ఆఖరి నిమిషం వరకు కొనసాగే బేరసారాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశముంది. ఒకే వారంలో పలువురు స్టార్ హీరోల సినిమాలుంటే ఆడియన్స్ తమ ఛాయిస్ ను డివైడ్ చేయాల్సి వస్తుంది. మొదటి మూడు రోజుల కలెక్షన్లపై ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ చూపే అవకాశముంది. ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోలేకపోతే, మరో సినిమాకు ఎక్స్‌ట్రా షోస్ కేటాయించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. దీంతో థియేటర్ల నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ పూర్తైందనే రీజన్ తో మాత్రమే సంక్రాంతికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం సరిపోదు. మార్కెట్ సిట్యుయేషన్స్, స్క్రీన్స్ అందుబాటు, పోటీ సినిమాల స్ట్రెంగ్త్, ఆడియన్స్ అభిరుచిని కూడా సమానంగా అంచనా వేసి రిలీజ్ ప్లాన్ ను రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పండగ టైమ్ దగ్గరపడే కొద్దీ రిలీజ్ డేట్స్ లో మార్పులు, కొత్త అనౌన్స్‌మెంట్స్, లాస్ట్ మినిట్ డెసిషన్స్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. సంక్రాంతి బాక్సాఫీస్ వాల్యూ ఎంత పెరిగిందో చెప్పడానికి భారీ సినిమాల ఆసక్తే నిదర్శనం. కానీ అదే సమయంలో ఆ పోటీని సమర్థంగా నిర్వహించడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఈ సీజన్‌లో ఎదురయ్యే అతిపెద్ద సవాలుగా మారనుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.