నిన్న 'కుబేర' ఇప్పుడు 'కింగ్‌డమ్'!
టాలీవుడ్ సినిమాలపై ఓటీటీ ఆధిపత్యం మరీ మితిమీరుతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.;
టాలీవుడ్ సినిమాలపై ఓటీటీ ఆధిపత్యం మరీ మితిమీరుతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ తరువాత ఓటీటీల ప్రభావం పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించడం తెలిసిందే. దీంతో ఓటీటీకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇంటి వద్దే కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్క టికెట్ ఖర్చుతో సినిమాలు చూస్తుండటంతో ఓటీటీలు ఇప్పుడు కొత్త పాట పాడుతూ ప్రొడ్యూసర్స్‌ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాయి.
ఈ విషయం తాజాగా బయటికి రావడంతో అంతా అవాక్కవుతున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ `కుబేర`. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా మూవీని పి. రామ్మోహన్‌రావుతో కలిసి సునీల్ నారంగ్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాని జూలైలో మేకర్స్ రిలీజ్ చేయాలనుకున్నారట.
అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అభ్యంతరం వ్యక్తం చేసి జూలైలో రిలీజ్ చేస్తే ఇచ్చే మొత్తంలో రూ.10 కోట్లు కోత విధిస్తామని బెదిరించడంతో చేసేది లేక ఈ సినిమాని వారు నిర్ణయించి డేట్ ప్రకారమే జూన్ 20న రిలీజ్‌కు అంగీకరించారని నిర్మాత సునీల్ నారంగ్ ఇటీవల బయటపెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో `కింగ్‌డమ్` మూవీకి ఒత్తిడి మొదలైనట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే వరుసగా రిలీజ్ వాయిదాపడుతున్న నేపథ్యంలో ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో జూలై 25న రిలీజ్ చేయాల్సిందేనని నెట్ ఫ్లిక్స్ వర్గాలు `కింగ్‌డమ్` మేకర్స్‌కు తాజాగా ఆల్టిమేటమ్ జారీ చేశారట. అయితే ఇప్పుడు వీరికో చిక్కొచ్చిపడింది. ఇదే సమయంలో పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయితే దాని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్‌లపై పడే ప్రమాదం ఉందని మేకర్స్ భయపడుతున్నారట. మరి ఈ సమస్య నుంచి కింగ్‌డమ్ ఎలా గట్టెక్కుతుందో తెలియాలంటే జూలై 25 వరకు వేచి చూడాల్సిందే.