ఈ వారమంతా చిన్న చిత్రాలదే.. ఏది క్లిక్కయ్యేనో..
2026లో అప్పుడే ఫస్ట్ మంత్ గడిచిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేయగా.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.;
2026లో అప్పుడే ఫస్ట్ మంత్ గడిచిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేయగా.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. గత నెలలో సగానికిపైగా బడా హీరోల సినిమాల సందడి ఉండగా.. ఈసారి మాత్రం చిన్న చిత్రాలదే హవా అని చెప్పాలి. గత వారం కేవలం ఒక్క సినిమా సోలోగా విడుదలై అసలు మెప్పించలేకపోయింది.
కానీ ఈ వారం మాత్రం దాదాపు డజన్ కు పైగా చిన్న చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమైన సినిమాల జాబితా వైవిధ్యంగా ఉండటం విశేషం. సుమతి శతకం, హనీ, శ్రీ చిదంబరం గారు, విత్ లవ్ (తెలుగు డబ్), యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా, ఎర్రచీర, లగ్గం టైమ్, బ్లడ్ రోజెస్ వంటి చిత్రాలు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, థ్రిల్లర్లు, యూత్ ఎంటర్టైనర్లు ఇలా అన్ని జానర్లలో సినిమాలు ఉండటంతో ప్రతి వర్గం ప్రేక్షకులకు ఏదో ఒక ఆప్షన్ దొరికే అవకాశముంది. ముఖ్యంగా పెద్ద స్టార్ల సినిమాలు లేకపోవడం చిన్న చిత్రాలకు కలిసొచ్చే అంశంగా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే థియేటర్ల సంఖ్య ఎక్కువగా వాటికే దక్కుతాయి.
కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటంతో చిన్న సినిమాలకు మంచి స్క్రీన్ కౌంట్ దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో పాజిటివ్ టాక్ వస్తే ఆయా సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. స్టార్ పవర్ కంటే కథ బాగుంటే థియేటర్లకు వస్తున్న ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.
చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు కూడా మంచి కథనం, బలమైన ఎమోషన్స్ తో వస్తే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఏది సర్ప్రైజ్ హిట్ గా నిలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఒకేసారి ఎక్కువ సినిమాలు రావడం వల్ల పోటీ ఉండబోతోంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రమోషన్లు, పాజిటివ్ రివ్యూలు కీలక పాత్ర పోషించనున్నాయి.
మొదటి రోజే మంచి స్పందన దక్కించుకున్న సినిమాలు ఎక్కువ రోజులు నిలబడగలవన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. మొత్తానికి ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య గట్టి పోటీ జరగనుంది. పెద్ద హీరోలు లేకున్నా, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధించగలవని మరోసారి నిరూపించుకునే అవకాశం ఇది. మరి ఈ వారం ప్రేక్షకుల తీర్పు ఏ సినిమాకు ఎలా ఉంటుందో వేచి చూడాలి.