ఆస్కార్ రేసులో టాలీవుడ్ వెనుకబడటానికి అసలు కారణం ఇదేనా?

మహారాష్ట్ర నుంచి `గొంధల్` చిత్రం ఎంపికైనట్లుగానే.. మన సంస్కృతి- జానపదాలు- స్థానిక జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించే ప్రయోగాలు రావాలి.

Update: 2026-09-19 03:48 GMT

ఈ ఏడాది (2026) జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో టాలీవుడ్‌లో దాదాపు 100కు పైగా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కమర్షియల్ హంగులతో భారీ వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నా ఆస్కార్ లేదా అంతర్జాతీయ అవార్డుల ప్రమాణాలకు సరిపోయేలా ప్రత్యేకమైన కంటెంట్ ఉన్న సినిమాలు రాకపోవడానికి ప్రధాన కారణం మన చిత్ర పరిశ్రమలో వాణిజ్య సమీకరణాలకు ఇస్తున్న ప్రాధాన్యతే. 99వ అకాడమీ అవార్డుల రేసు కోసం భారతదేశం నుంచి వచ్చిన 33 చిత్రాల జాబితాలో తెలుగు నుంచి కొన్ని సినిమాలు పరిశీలనలోకి వచ్చిన్నా ఎంపిక కావడంలో విఫలమయ్యాయి.

ఇలా తెలుగు చిత్రాలు అర్హత కోల్పోవడానికి ప్రధాన కారణం.. అంతర్జాతీయ జ్యూరీ కోరుకునే సహజమైన గ్రామీణ వాతావరణం.. ఆర్టిస్టిక్ అప్రోచ్... బలమైన మానసిక భావోద్వేగాలు లేదా ప్రత్యేకమైన కథాంశాల కంటే మన దగ్గర ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్.. కమర్షియల్ హంగులు.. పాటలు.. ఫైట్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడమే. అయితే మహారాష్ట్రకు చెందిన సాంప్రదాయ జానపద నేపథ్యంతో తెరకెక్కిన మరాఠీ చిత్రం `గొంధల్` ఎలాంటి అంచనాలు లేకుండానే ఆస్కార్‌కు అధికారిక భారతీయ ఎంట్రీగా ఎంపికై చరిత్ర సృష్టించడం గమనార్హం.

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్ పై నిలపడంలో ఎస్.ఎస్. రాజమౌళి లాంటి దర్శకుల కృషి ఎంతో ఉంది. ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సాధించిన విజయం తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఎలా ఉండాలనే దానిపై టాలీవుడ్‌లో ఒక స్పష్టత వచ్చింది. అయితే కేవలం ఒక్క రాజమౌళి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేయాలని ఆశించడం సరికాదు. ప్రతిసారీ ఒక అద్భుతం జరగడం కోసం ఎదురుచూడకుండా.. మిగతా దర్శకులు కూడా కమర్షియల్ వలయాల నుంచి బయటికి వచ్చి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

మన ఫిలింమేకింగ్‌లో అవార్డుల ప‌ర్ప‌స్ కావాల‌నుకుంటే.. ఆ త‌ర‌హా మార్పులు రావాలంటే బాక్సాఫీస్ లెక్కలు, రికార్డుల కంటే మనుషుల అంతరంగాలను ఆవిష్కరించే గ్రిప్పింగ్ రియలిస్టిక్ కథాంశాలపై దృష్టి పెట్టాలి. మహారాష్ట్ర నుంచి `గొంధల్` చిత్రం ఎంపికైనట్లుగానే.. మన సంస్కృతి- జానపదాలు- స్థానిక జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించే ప్రయోగాలు రావాలి. టెక్నికల్ వాల్యూస్‌తో పాటు స్క్రీన్ ప్లేలో పదును.. అనవసరమైన సాగదీత లేని కథనం.. పాత్రల నడుమ సహజమైన ఎమోషన్స్ ఉండటం చాలా ముఖ్యం.

టాలీవుడ్ మేకర్స్ కేవలం నార్త్ అమెరికా ఓవర్సీస్ మార్కెట్లు- కలెక్షన్లనే కాకుండా గ్లోబల్ ఆడియెన్స్ మెచ్చేలా ఆర్టిస్టిక్ వాల్యూస్‌తో కూడిన చిత్రాలను తెరకెక్కిస్తేనే ఆస్కార్‌ రేసులో మనమూ సత్తా చాటగలం. కేవలం కమర్షియల్ విజయాలకే పరిమితం కాకుండా.. కళాత్మక విలువలకు పెద్దపీట వేసినప్పుడే తెలుగు సినిమా స్థాయి ఖండాంతరాలు దాటుతుంది.

చ‌ర‌ణ్‌ `పెద్ది` ట్రై చేసినా కానీ..!

ఆస్కార్ 2026-2027 రేసులో రామ్ చరణ్ నటించిన భారీ కమర్షియల్ చిత్రం `పెద్ది` కూడా పోటీప‌డింది. కానీ ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టి.. సంతోష్ దవాఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ జానపద థ్రిల్లర్ `గొంధల్` 99వ అకాడమీ అవార్డులకు భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన రూ.400 కోట్లకు పైగా వసూలు చేసిన `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఎంపిక చేసిన 33 చిత్రాల బలమైన జాబితా నుంచి ఆస్కార్ రేసులో నిలవడంలో విఫలమైంది.

భార‌త‌ దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు `గొంధల్` ఎంపిక కాకముందు `ధురంధర్`, `బోర్డర్ 2`, `ఇక్కిస్` వంటి చిత్రాలతో కూడిన 33 బలమైన చిత్రాల జాబితాలో `పెద్ది` కూడా పోటీలో నిలిచింది. కానీ చివరికి ఈ భారీ చిత్రాలేవీ రేసులో నిల‌వ‌లేక‌పోయాయి.

Full View
Tags:    

Similar News