ముంబై- దుబాయ్ రియ‌ల్ ఎస్టేట్‌పై స్టార్ల‌ క‌న్ను!

ఇటీవ‌లి కాలంలో ముంబై ఔట‌ర్ లోని రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు బాలీవుడ్ స్టార్లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-24 15:30 GMT

ఇటీవ‌లి కాలంలో ముంబై ఔట‌ర్ లోని రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు బాలీవుడ్ స్టార్లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. బాంద్రా లాంటి ఖ‌రీదైన ప్రాంతంలోనే కాదు, అంధేరి వెస్ట్ స‌హా ఔట‌ర్ లోని ప‌లు ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ లో సెల‌బ్రిటీలు పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఆస‌క్తిక‌రంగా పాన్ ఇండియా మార్కెట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న టాలీవుడ్ బ‌డా హీరోలు కూడా ముంబైలో ఆస్తులు కొనుగోలు చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఒక సొంత ఆఫీస్ కొనుగోలు చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఉపాస‌న తో క‌లిసి చ‌ర‌ణ్ ఈ ప్రాప‌ర్టీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించార‌ని గ‌త ఏడాది క‌థ‌నాలొచ్చాయి.

చ‌ర‌ణ్ మాత్ర‌మే కాదు, ఇంకా ఇత‌ర పెద్ద హీరోలు ముంబైలో సొంత కార్యాల‌యాల కోసం ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. మ‌న స్టార్ల గ‌మ్య స్థానం కేవ‌లం ముంబై మాత్ర‌మే కాదు.. దుబాయ్ విలాసాల్లో అద్భుత‌మైన జీవ‌న‌శైలిని ఆస్వాధించ‌డం కూడా. ప‌లువురు టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు దుబాయ్ లోని ఆకాశ‌హార్మ్యాల్లో విలాస‌వంత‌మైన అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. మ‌హేష్, అల్లు అర్జున్, చ‌ర‌ణ్ వంటి పెద్ద స్టార్లు దుబాయ్ కి రెగ్యుల‌ర్ గా వెళుతున్నారు. మెగా కుటుంబంలోని ఒక‌రిద్ద‌రికి దుబాయ్ లో ఆస్తులున్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. చాలా మంది సెల‌బ్రిటీ క‌పుల్స్ దుబాయ్ లో కుటుంబ స‌మేతంగా విహార‌యాత్ర‌లను ప్లాన్ చేస్తున్నారు. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ముంబై, దుబాయ్ వంటి చోట్ల రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెట్టార‌ని క‌థ‌నాలొచ్చాయి.

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ యువ‌హీరో దుబాయ్ లో సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు సెర్చ్ చేస్తున్నార‌ని తెలిసింది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డు వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఒక‌ట్రెండు సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు. వ‌రుస‌గా అడ్వాన్సులు అందుకుంటున్నాడు. అయితే త‌న సంప‌ద‌ను తెలివిగా దుబాయ్ రియ‌ల్ ఎస్టేట్ లో పెడుతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అత‌డి ఆలోచ‌న‌లు ఇత‌ర యువ‌హీరోల‌లోను స్ఫూర్తిని నింపుతున్నాయ‌ని తెలిసింది. కుటుంబ స‌మేతంగా దుబాయ్ లో విహార యాత్ర‌ల‌ను ఆస్వాధించాల‌నే ఆలోచ‌న ఇప్పుడు టైటైర్ హీరోల్లోను క‌నిపిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. దుబాయ్ ఎక్స్ పో పేరుతో హైద‌రాబాద్ వంటి చోట్ల భారీ రియ‌ల్ ఎస్టేట్ ఎక్స్ పోలు జ‌రుగుతుంటే, అక్క‌డ ఎక్కువ‌గా సెల‌బ్రిటీలే క‌నిపిస్తున్నార‌ని టాక్ ఉంది.

హీరోల‌కు ఆదాయాలు పెరిగాయి. ఆస్తుల‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. దుబాయ్ లాంటి అంద‌మైన డెస్టినేష‌న్ లో ఆస్తి ఉండాల‌ని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు అస్త‌వ్య‌స్థ‌ అమెరికా కంటే దుబాయ్ కి ఫ్లోటింగ్ పెరిగింద‌ని చెబుతున్నారు. సాధార‌ణ మిడ్ రేంజ్ హీరోలు సైతం కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటున్నారు గ‌నుక, ఈ సంప‌ద‌ల్ని తెలివిగా వ్యాపారాల్లో పెట్టుబ‌డి పెడుతున్నారు. ప‌లు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News