మల్టీస్టారర్ ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకునేదెప్పుడు?
మలయాళ ఇండస్ట్రీలో కథే హీరో. అక్కడ స్టార్ డం కన్నా పాత్ర ప్రాధాన్యతకే ఎక్కువ విలువ ఇస్తారు.;
భారతీయ సినీ పరిశ్రమలో మలయాళ, హిందీ చిత్రరంగాలు మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలు స్తున్నాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు అవసరమైతే చిన్న పాత్రలు చేయడానికి లేదా పక్కా మల్టీస్టారర్లలో నటించడానికి అస్సలు వెనుకాడరు. బాలీవుడ్‌లో కూడా ఖాన్లు, కపూర్లు ఒకరి సినిమాల్లో ఒకరు కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ టాలీవుడ్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్టార్ హీరోల ఇమేజ్, వారి అభిమానుల అంచనాలు , బాక్సాఫీస్ లెక్కలు మల్టీస్టారర్ల బాటలో అడ్డంకులుగా మారుతున్నాయి.
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్లు సర్వసాధారణంగా ఉండేవి. ఆ తర్వాతి తరంలో వెంకటేష్ వంటి హీరోలు ఈ ట్రెండ్‌ను మళ్లీ మొదలుపెట్టినప్పటికీ అది ఒక ఒరవడిగా మారలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు భారీ విజయం సాధించినా? టాలీవుడ్ అగ్ర హీరోలు ఇంకా ఇతర స్టార్లతో స్క్రీన్ పంచుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నట్లే సన్నివేశం కనిపిస్తోంది. తమ ఇమేజ్ దెబ్బతింటుం దేమో లేదా స్క్రీన్ టైమ్ విషయంలో తేడాలు వస్తాయేమో అనే సంకోచం ఇంకా చాలా మంది హీరోల్ని వెంటాడుతన్నట్లే ఉంది .
మలయాళ ఇండస్ట్రీలో కథే హీరో. అక్కడ స్టార్ డం కన్నా పాత్ర ప్రాధాన్యతకే ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఫహాద్ ఫాజిల్ వంటి నటులు నెగిటివ్ రోల్స్ చేసినా? అతిథి పాత్రలు పోషించినా? ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. టాలీవుడ్ లో మాత్రం హీరో అంటే కేవలం రక్షకుడుగానే ఉండాలనే ధోరణి ఇంకా పూర్తిగా పోలేదు. అగ్ర హీరోలు కేవలం సోలో సినిమాలు లేదా తమ కుటుంబ సభ్యులతో చేసే సినిమాలకే పరిమితమవుతున్నారు. దీంతో భారీ కాంబినేషన్లను చూడాలనుకునే సగటు ప్రేక్షకుడు నిరాశకు గురవుతున్నాడు అన్నది వాస్తవం.
తెలుగు హీరోల మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంటుంది. కానీ అది వెండితెరపై సినిమాల రూపంలోకి మారడం లేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ల మధ్య రావాల్సిన క్రేజీ కాంబినేషన్లు ఇంకా పేపర్ వరకే పరిమితమవుతున్నాయి. ఒకరు హీరోగా ఉంటే మరొకరు విలన్‌గానో లేదా కీలకమైన సపోర్టింగ్ రోల్‌లోనో కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. కానీ ఇక్కడ హీరోల మార్కెట్ పరిధి పెరగడం వల్ల వారి పారితోషికాలు, ఈగోలు మేకర్లకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఇతర భాషల నటులను విలన్లుగా తెచ్చుకోవడం కంటే మన ఇండస్ట్రీలోని స్టార్లనే సరికొత్త పాత్రల్లో చూపించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.
ఒక అగ్ర హీరో సినిమాలో మరో అగ్ర హీరో కీలక పాత్ర పోషిస్తే? ఆ సినిమాకు వచ్చే క్రేజ్ , వసూళ్లు ఊహించని విధంగా ఉంటాయి. హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో ఒకే స్క్రీన్‌పై ఎక్కువ మంది సూపర్ స్టార్లు కనిపించే రోజులు టాలీవుడ్‌లో ఎప్పుడు వస్తాయా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోన్న తరుణంలో టాలీవుడ్ హీరోలు తమ ఇమేజ్ చట్రాల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కథ డిమాండ్ చేస్తే ఇతర స్టార్లతో కలిసి నటించడం వల్ల పరిశ్రమకు కొత్త ఊపిరి అందుతుంది. ఫ్యాన్ వార్స్ గురించి ఆలోచించకుండా? మంచి సినిమాను అందించే క్రమంలో హీరోలు మీనమేషాలు లెక్కించడం మానేసి కలిసి అడుగులు వేస్తేనే తెలుగు సినిమా నిజమైన మల్టీస్టారర్ యుగాన్ని చూస్తుంది.