C 1550-కృష్ణానగర్.. ఈ పిల్లర్ దగ్గర నిలబడితే పెద్ద స్టార్ అవ్వొచ్చు!
టాలీవుడ్ కు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టాలీవుడ్ కు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు నిత్యం ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు అవకాశాల కోసం ఎదురుచూడటం ఇక్కడ సర్వసాధారణమైన విషయం.
అయితే ఈ కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్న ఒక నిర్దిష్టమైన C 1550-కృష్ణానగర్ పిల్లర్ దగ్గర జూనియర్ ఆర్టిస్టులు గుంపులు గుంపులుగా గంటల తరబడి నిలబడి ఉండటం గమనించవచ్చు. ఉదయం పూట సినిమా షూటింగ్‌లకు అవసరమైన జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి పలు ప్రొడక్షన్ కంపెనీల మేనేజర్లు, కాస్టింగ్ కోఆర్డినేటర్లు ఆ ప్రాంతానికి వస్తుంటారు. ఏ పాత్రకైనా సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకోవడానికి ఆ పిల్లర్ ప్రాంతం ఒక ప్రధాన అడ్డాగా మారుతుంది.
తమకు ఏదైనా చిన్న ఛాన్స్ వస్తుందనే ఆశతో.. తమ కళను ప్రదర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది శ్రామికులు ఆ పిల్లర్ వద్ద ఉదయాన్నే వచ్చి వేచి చూస్తుంటారు. ఎవరైనా మేనేజర్ వస్తే తమ ఫోటోలు లేదా వివరాలు ఇవ్వడానికి, లేదా వారు పిలిచే అవకాశం కోసం ఉత్సాహంగా ఎదురుచూడటం అక్కడి నిత్యకృత్యం. ఆ చిన్న పిల్లరే వారి ఉపాధికి, భవిష్యత్ సినిమా కలలకు ఒక వారధిలా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
కొన్నిసార్లు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాసినా ఎలాంటి అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగే సందర్భాలు కోకొల్లలు. అయినా మరుసటి రోజు మళ్లీ అదే ఆశతో ఆ పిల్లర్ వద్దకు చేరుకోవడం వారి పట్టుదలకు నిదర్శనం. సినిమా రంగంలో నిలదొక్కుకోవాలనే వారి కఠిన శ్రమకు, అంతులేని ఎదురుచూపులకు ఈ ప్రదేశం ఒక మూగ సాక్షిగా నిలుస్తోంది. అయితే జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్ల ఎంపిక జరిగే ఈ పిల్లర్ నంబర్ ఇప్పుడు అందరిలోను బాగా పాపులరైంది. C 1550-కృష్ణానగర్ పిల్లర్ దగ్గర నిలుచుంటే చాలు పెద్ద స్టార్ అవ్వొచ్చు! అంటూ జూనియర్ ఆర్టిస్టులు ముచ్చటించుకోవడం ఆసక్తికరం.
నేపథ్యం లేకపోయినా..
సినీ పరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా, కేవలం తమ ప్రతిభ.. పట్టుదలపై నమ్మి చిన్న చిన్న పాత్రలతో జూనియర్ ఆర్టిస్టులుగా ప్రస్థానం ప్రారంభించి నేడు భారతీయ సినీ పరిశ్రమలో పేరున్న నటీనటులుగా వెలుగొందుతున్న వారు ఎందరో ఉన్నారు. కెరీర్ ఆరంభంలో జనంలో ఒకరిగా కనిపిస్తూ.. గ్రూప్ డాన్సులు చేస్తూ.. చిన్న ప్రధాన్యత లేని పాత్రల్లో నటించిన నటులు కొద్దికొద్దిగా తమ నటనతో... కష్టంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఉదాహరణకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్ల కలెక్షన్లు రాబట్టే స్థాయికి ఎదిగిన కొందరు ప్రముఖ స్టార్లు కూడా తమ తొలి రోజుల్లో జూనియర్ ఆర్టిస్టులుగా, ఎక్స్‌ట్రా ఆర్టిస్టులుగా కెమెరా ముందు నిలబడినవారే కావడం గమనార్హం.
ఈ కోవకు చెందిన ప్రముఖులలో రవితేజ, ప్రకాష్ రాజ్ వంటి ఎందరో దిగ్గజాలు ఉన్నారు. నటుడిగా ఎదగడానికి ముందు రవితేజ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, గుర్తింపు లేని వేషాలు వేస్తూ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డారు. అలాగే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొని.. జూనియర్ ఆర్టిస్టుల స్థాయి నుండి నేడు ఇండియన్ సినిమా గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న నటులు ఎందరో ఉన్నారు. వీరు పడిన కష్టం.. చూపించిన అంకితభావం నేడు సినిమా రంగంలో ప్రవేశించాలనుకునే వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రవితేజ నేనింతే సినిమాలో చూపించిన కష్టాల్లో వాస్తవం ఎంత ఉన్నా .. ఒకరు స్టార్ అయ్యాక వెలిగే వెలుగు గురించి ఎవరికీ వివరంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అలాంటి ఒక రోజు కోసం ఇక్కడ ఎదురు చూడాల్సి ఉంటుంది.