నాటి శ్రీ‌రాముడి పాదాల‌కు మొక్కే గొప్ప వ్య‌క్తిత్వం నేటి శ్రీ‌రాముడిది!

కేవలం నటన పరంగానే కాకుండా రణ్‌బీర్ కపూర్ వ్యక్తిగత సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకుందని అరుణ్ గోవిల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Update: 2026-10-01 03:43 GMT

బాలీవుడ్ తెరపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం` గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల వెలువడిన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 1987 నాటి `రామాయణం` సీరియ‌ల్‌లో రాముడిగా జీవించి దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించుకున్న సీనియర్ నటుడు అరుణ్ గోవిల్.. ఈ కొత్త చిత్రంలో రాముడి తండ్రి అయిన `దశరథ మహారాజు` పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుత యువ నటులలో రణ్‌బీర్ కపూర్ మాత్రమే తాను ఊహించిన శ్రీరాముడి రూపానికి.. హావభావాలకు వంద‌శాతం సరిగ్గా సరిపోతాడని ఆయన కొనియాడారు. రణ్‌బీర్ నడక.. కూర్చునే విధానం.. చూపు.. మాట్లాడే తీరు అచ్చం రాముడిని తలపించేలా ఉన్నాయని తెలిపారు.

కేవలం నటన పరంగానే కాకుండా రణ్‌బీర్ కపూర్ వ్యక్తిగత సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకుందని అరుణ్ గోవిల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంత పెద్ద స్టార్‌డమ్ ఉన్న నటుడిగా ఉండి కూడా.. సెట్స్‌లో తన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ఊహించని పరిణామమని ఆయన పేర్కొన్నారు. ``నాటి శ్రీరాముడి పాదాలకు మొక్కే గొప్ప వ్యక్తిత్వం నేటి శ్రీరాముడిది`` అంటూ రణ్‌బీర్ నిరాడంబరతను.. పెద్దల విష‌యంలో చూపించే గౌరవాన్ని అరుణ్ గోవిల్ హృదయపూర్వకంగా ప్రశంసించారు.

ఇదే చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సౌత్ సెన్సేషన్ సాయిపల్లవి సైతం రణ్‌బీర్ లుక్‌పై స్పందించారు. రణ్‌బీర్‌ను తొలిసారి రాముడి గెటప్‌లో చూసినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యపోయానని... చిన్నతనంలో తాను పుస్తకాల్లో చూసిన రాముడి రూపం.. కొంచెం వంచిన తల, ధైర్యాన్ని ప్రతిబింబించే విల్లు వంటి లక్షణాలు ఆయనలో కనిపించాయని తెలిపారు. శ్రీ‌రాముడి పాత్రలో నటించడం తనకు కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని... ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు స్వయంగా రణ్‌బీర్ కపూర్ కూడా వెల్లడించారు. అయితే శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన క్ర‌మంలో కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ నెమ్మ‌దిగా ఈ పాత్ర‌ను పోషిస్తున్న ర‌ణ‌బీర్ పై పాజిటివ్ ఇంప్రెష‌న్ పెరుగుతోంది. సీనియ‌ర్ న‌టులు అత‌డి రూపాన్ని, ఆహార్యాన్ని కొనియాడుతుంటే అది ప్ర‌జ‌ల్లోకి పాజిటివ్ వైబ్రేష‌న్స్ ని పంపుతోంది.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తుండగా.. శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మైలురాయిగా నిలవనున్న ఈ భారీ పౌరాణిక దృశ్యకావ్యం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News