రానా రిలీజ్ చేస్తున్న ఈ మూవీ గురించి ఏం తెలుసు?
టాలీవుడ్ నటుడు- నిర్మాత దగ్గుబాటి రానా విషయం ఉన్న సినిమాలకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నటుడు- నిర్మాత దగ్గుబాటి రానా విషయం ఉన్న సినిమాలకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. యువదర్శకులు తెరకెక్కించిన పలు సినిమాల విజయంలో అతడి సహకారం ఎంతో గొప్పది. ఇప్పుడు తమిళ డబ్బింగ్ చిత్రం `డోరతి` వంతు. తాజాగా విడుదలైన `డోరతి` తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విభిన్న కథాంశాలను ఎల్లప్పుడూ ఆదరించే రానా... దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచనపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ వైపు ఆకర్షితులైనట్లు తెలిపారు. సినిమా గురించి పెద్దగా ముందస్తు అంచనాలు లేకుండా.. కేవలం ఒక సాధారణ ఆహ్వానం మేరకు ఈ చిత్రాన్ని చూసేందుకు వెళ్లినట్లు రానా వెల్లడించారు.
సినిమా ప్రథమార్థం చూస్తున్న సమయంలో ఇది సాధారణ గ్యాంగ్‌స్టర్ డ్రామా లేదా స్నేహం, ద్రోహం చుట్టూ తిరిగే రొటీన్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అవుతుందని తాను భావించినట్లు రానా చెప్పారు. అయితే ఇంటర్వెల్ సమయానికి కథ పూర్తిగా ఊహించని మలుపు తిరుగుతుందని.. ఆ సమయంలో తాను అనుభవించిన ఉత్కంఠ తనను విపరీతంగా ఆకట్టుకుందని తెలిపారు. ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ డైరెక్టర్ ఇంతటి ఇంటెన్సిటీ ఉన్న కథను తెరకెక్కించడం చూసి తనకు ఎంతో గర్వంగా అనిపించిందని కొనియాడారు.
ప్రస్తుత కాలంలో భారతీయ సమాజంలో కొన్ని సున్నితమైన అంశాలను ప్రధాన స్రవంతి సినిమాల్లో ప్రస్తావించడం ఎంత కష్టమో రానా గుర్తుచేశారు. ఏది సరైన టాపిక్.. దాన్ని ఏ విధంగా చర్చిస్తే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది అనే అంశాలను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు. ఈ కారణం చేతనే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని.. తెలుగు ప్రేక్షకులకు అందించాలని తాను నిర్ణయించుకున్నట్లు రానా స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల అభినయంపై రానా ప్రశంసల వర్షం కురిపించారు. తెరపై వారి నటన ఎంత సహజంగా ఉందంటే.. చూస్తున్న ప్రేక్షకులు కూడా వారి ప్రయాణంలో భాగమైన అనుభూతిని పొందుతారని చెప్పారు. ఇటీవలి కాలంలో తాను చూసిన సినిమాల్లో ఇంతటి రియలిస్టిక్ ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇదేనని.. నటీనటుల మధ్య ఉన్న బలమైన బంధం తెరపై స్పష్టంగా కనిపిస్తోందని అతడు అభిప్రాయపడ్డారు.
చివరగా.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని రానా పిలుపునిచ్చారు. సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా సినిమాను ఆస్వాధించడానికి ఇది సరైన సమయమని తెలిపారు. ఇలాంటి వైవిధ్యభరితమైన.. ఆలోచింపజేసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ అతడు తన ప్రసంగాన్ని ముగించారు.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన `డోరతి` సినిమా ఇప్పటికే తమిళ వెర్షన్ విడుదల కాగా, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. వాణిజ్య హంగులకు దూరంగా 1990ల నాటి గ్రామీణ వాతావరణం, కుల వ్యవస్థ, స్నేహం నేపథ్యంలో ఒక రూరల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. జియో స్టూడియోస్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్, ధమ్మమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి.. ట్రేడ్ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో ఇళయరాజా అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం కథలోని తీవ్రతను మరింత పెంచింది. కీర్తి సురేష్‌తో పాటు సానంత్, రిషికాంత్ తదితరులు తమ సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలు విమర్శకుల ప్రశంసలు పొందేలా చేశాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన అనుభూతిని పంచే సినిమా ఇదని చెబుతున్నారు. అయితే తెలుగులో ఈ మూవీ రిలీజయ్యాక ఇక్కడి ప్రజలు ఎలాంటి రిజల్ట్ అందిస్తారో వేచి చూడాలి.