అందాల భామల ఇమేజ్ మేకోవర్!
సినీ పరిశ్రమలో నటి ప్రాచుర్యం పొందిన అనంతరం నిర్దిష్టమైన ఇమేజ్ ముద్ర పడిపోవడం సహజం.;
సినీ పరిశ్రమలో నటి ప్రాచుర్యం పొందిన అనంతరం నిర్దిష్టమైన ఇమేజ్ ముద్ర పడిపోవడం సహజం. ఒకసారి హోమ్లీ పాత్రలో మెరిస్తే అవే తరహా అవకాశాలు రావడం లేదా గ్లామర్ పాత్రలు చేస్తే కేవలం ఆ బాటలోనే సాగడం టాలీవుడ్‌లో తరచుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. నేటి తరం కథానాయికలు తమ పాత ఇమేజ్‌ను చెరిపేస్తూ వైవిధ్యమైన జోనర్లలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదని నటనలో వైవిధ్యం చూపాలని నిరూపిస్తున్నారు.
`సీతారామం` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో దేవతలా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో అమ్మడు పలికించిన హావభావాలు, పద్ధతైన వస్త్రధారణ పక్కా హోమ్లీ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అయితే అదే ఇమేజ్‌కు పరిమితం కాకుండా మృణాల్ `డెకాయిట్` చిత్రంలో ఛాలెంజింగ్ రోల్‌ను పోషించింది. గతంలోని సాఫ్ట్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ చిత్రంలో అమ్మడు యాక్షన్ - రా లుక్ లో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. దీంతో మృణాల్ ని ఏ ఒక్క పాత్రకో పరిమితం అయ్యే నటి కాదని..ఎలాంటి పాత్రలోనైనా నటించి ఇమేజ్ మార్చుకోగల నటిగా నిరూపించింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన కెరీర్ గ్రాఫ్‌ను కొత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన రష్మిక బాలీవుడ్ మూవీ `కాక్టైల్ 2` లో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతుంది. ఈ సినిమాలో అమ్మడు అత్యంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో కనిపిం చబోతుంది. గ్లామర్ పరంగా తన పరిమితులను పెంచుకుంటూనే, నటిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది.`ఇస్మార్ట్ శంకర్ ` మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన నభా నటేష్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది.
కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా కథాబలం ఉన్న చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అలాగే టాలీవుడ్ నవ సంచలనం భాగ్యశ్రీ బోర్సే కూడా తదుపరి చిత్రాల్లో కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా? పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉన్న రోల్స్‌ను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.హీరోయిన్లు ఇలా ఇమేజ్ మేకోవర్ చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచి మారడమే. ప్రస్తుతం ఆడియన్స్ కేవలం పాటలకు, గ్లామర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
కథలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆమె నటనలో వైవిధ్యం ఉందా? లేదా? అని గమనిస్తున్నారు. అందుకే కథానాయికలు కూడా తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విభిన్నమైన జోనర్లను, గ్రిప్పింగ్ కథలను ఎంచుకుంటున్నారు. ఇది వారి కెరీర్ ఎక్కువ కాలం కొనసాగడానికి దోహదప డుతుంది. అందాల భామలు చేస్తోన్న ఇమేజ్ మేకోవర్ చిత్ర పరిశ్రమలో సానుకూల మార్పుగా భావించొచ్చు. మృణాల్, రష్మిక, నభా నటేష్, భాగ్యశ్రీ వంటి నటీమణులు చూపిస్తోన్న తెగింపు భవిష్యత్తులో మరిన్ని బలమైన మహిళా ప్రధాన పాత్రలు రావడానికి పునాది వేస్తోంది. ఒక నటిని కేవలం గ్లామర్ వస్తువుగా కాకుండా? కళాకారిణిగా గుర్తించేలా ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. త్వరలో విడుదల కాబోయే వీరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.