అభిప్రాయాలు ఒకటే.. మరి ఒక్క పోస్ట్ కూడా లేదేంటి?

తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది నటులు తమ వ్యక్తిగత జీవితాల్లో లేదా సినిమాల ద్వారా పరోక్షంగా ధర్మబద్ధమైన జీవనశైలిని, సనాతన విలువలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు.;

Update: 2025-12-15 10:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది నటులు తమ వ్యక్తిగత జీవితాల్లో లేదా సినిమాల ద్వారా పరోక్షంగా ధర్మబద్ధమైన జీవనశైలిని, సనాతన విలువలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. బహిరంగ కార్యక్రమాలతోపాటు ఇంటర్వ్యూలలో సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గురించి గర్వంగా ఎప్పటికప్పుడు మరికొందరు మాట్లాడుతుంటారు..

అయితే రీసెంట్ గా సనాతన ధర్మం గొప్పతనాన్ని, ప్రాచీన హైందవ సంస్కృతిని తెరపై నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన అఖండ 2: తాండవం మూవీ చూపించిన విషయం తెలిసిందే. చైనా బయోవార్ కుట్రను ఓ శివ భక్తుడు ఎలా అడ్డుకున్నాడనే ఇతివృత్తాన్ని, సనాతన ధర్మాన్ని ప్రధానంగా ఎలివేట్ చేసింది ఆ చిత్రం.

ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యాక.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వేదికలపై, సోషల్ మీడియాలో తరచూ సనాతన ధర్మం, హిందూ సంస్కృతి గురించి మాట్లాడే ఇతర తెలుగు హీరోలు, 'అఖండ 2' వంటి భారీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కనీసం ఒక అభినందన పోస్ట్ కూడా పెట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

సినిమా ప్రమోషన్లలో, వివిధ ఈవెంట్లలో సనాతన ధర్మం కోసం చెబుతూ.. అందరూ భారతీయ సంస్కృతి కాపాడుకోవాలని చెప్పే పలువురు నటులు.. ఇప్పుడు అదే భావజాలంతో వచ్చిన సినిమాను ప్రోత్సహించడానికి ఎందుకు వెనకడుగు వేశారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువులు పోస్టులు పెడుతున్నారు.

సనాతన ధర్మంపై సినిమా తీసినప్పుడు, తోటి హీరోలు తమ మద్దతు తెలియజేయకపోవడం పరిశ్రమలోని ఐక్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ను కూడా ఇప్పుడు ఇంకొందరు గుర్తు చేస్తున్నారు.

నిన్న జరిగిన అఖండ 2 సక్సెస్ ఈవెంట్ లో తమన్.. సినిమాకు ఎదురైన ఆటంకం కోసం మాట్లాడారు. ఆ సమయంలో టాలీవుడ్ లో ఐక్యత లేదని.. అంతా నాదీ.. నేనే అంటూ ఉంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తమన్ కామెంట్స్ సందర్భోచితంగా అనిపిస్తున్నాయని, సినిమాకు బహిరంగ మద్దతు లభించకపోవడం వల్ల అలా మాట్లాడి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఏ హీరో కూడా అఖండ మూవీ గురించి పోస్ట్ పెట్టకపోవడం చర్చనీయాంశమే. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News