ఫ్రాంఛైజీలు యూటర్న్ తీసుకోకపోతే..!
సినిమాలు విజయం సాధించాలంటే కథ కంటెంట్ ఎంత కీలకమో ఇటీవల దర్శకనిర్మాతలు స్పష్ఠంగా తెలుసుకుంటున్నారు.;
సినిమాలు విజయం సాధించాలంటే కథ కంటెంట్ ఎంత కీలకమో ఇటీవల దర్శకనిర్మాతలు స్పష్ఠంగా తెలుసుకుంటున్నారు. ప్రేక్షకులు కంటెంట్ లేని సినిమాలను నిర్ధయగా తిరస్కరించేందుకు వెనకాడటం లేదు. సినిమాలో తాము ఆశించిన ఫీల్- భావోద్వేగం కనిపించకపోతే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గ్లోబల్ సినిమా భారతదేశంలో విస్త్రతంగా ఆదరణ పొందుతున్న ఈ రోజుల్లో, హాలీవుడ్ రేంజులో ప్రతిదీ కావాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. అందుకే ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకతను నిలుపుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో విడుదలైన టైగర్ 3- వార్ 2- థామ లాంటి ఫ్రాంఛైజీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి కారణాలు సుస్పష్ఠం. ఆయా సినిమాలు అంతకుముంందు చూసేసినవిగా ఉన్నాయి. లేదా ఏదో ఒక హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తిగా కనిపించడం నిరాశపరిచింది. కొత్తదనం లేకపోవడం లేదా విజువలైజేషన్ లో లోపాలు, గ్రాఫిక్స్ తీసుకున్న విధానం ఆకర్షణీయంగా లేకపోవడం లాంటి కారణాలు ఈ సినిమాల ఆదాయానికి గండికొట్టేలా చేశాయి. ఒక పెద్ద స్టార్ సినిమాకి మొదటి రోజు ఉన్న క్రేజు రెండో రోజు లేకపోవడానికి కారణం సినిమాలో కంటెంట్ లేకపోవడమే. ఎమోషన్ ఆడియెన్ కి కనెక్ట్ కాకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. ఇలాంటి రకరకాల కారణాలు ఫ్రాంఛైజీ సినిమాలను దెబ్బ కొట్టాయి. దీని కారణంగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేయడం కుదరదని కూడా నిరూపణ అవుతోంది. ఫ్రాంఛైజీ పేరుతో వ్యాపారం చేయొచ్చు.. కానీ వసూళ్లను పెంచలేరు. ప్రేక్షకులు ప్రతిదానిలో సెలక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో కథ, కంటెంట్, ఎమోషన్ పెంచే ఎలిమెంట్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పరాజయాల నుంచి వైఆర్ఎఫ్ కానీ, మడాక్ ఫిలింస్ కానీ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మునుముందు ఫ్రాంఛైజీలలో కొత్త సినిమాలను తెరకెక్కించేందుకు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించాలి. వార్, పఠాన్, భేదియా, స్ట్రీ 2 వంటి భారీ హిట్ చిత్రాలను రిపీట్ చేయాలంటే మరోసారి పునః విశ్లేషణ అవసరం. ఏదేమైనా యూనివర్శ్ కాన్సెప్టులో రిపీటెడ్ సీన్లతో రొటీన్ కథలు చూపిస్తామంటే వీక్షించేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగా లేరు.
ఉదాహరణకు అవతార్ ఫ్రాంఛైజీలో ప్రతి సినిమాలోను ఒకే తరహా విజువల్స్ ని చూపించేందుకు కామెరూన్ ప్రయత్నించలేదు. అవతార్ -1లో పండోరా గ్రహం, దానిపై అవతార్ ల భావోద్వేగాలు, యాక్షన్ ని చూపించిన కామెరూన్, ఆ తర్వాత పూర్తిగా అవతార్ లను భూమిపై నుంచి సముద్రంలోకి తీసుకుని వెళ్లారు. మెరైన బయోలజీ సబ్జెక్టును ఎంతో అందంగా తెరపై ఎలివేట్ చేసారు. అందువల్ల తొలి రెండు భాగాలు సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో భాగంలో అగ్నితో మిళితం చేసి కథను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. ఇప్పటికే అవతార్ 3 ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. మునుముందు అవతార్ 4, అవతార్ 5, అవతార్ 6 విషయంలోను కామెరూన్ సరికొత్త ఎత్తుగడలతో కథల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో భారతీయ సినిమా కూడా ఫ్రాంఛైజీ చిత్రాల ఒరవడిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.