ఎన్నో విబేధాలు.. మరెన్నో సమస్యలు.. టాలీవుడ్ లో ఏం జరగనుంది?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మరోసారి సంక్షోభం దిశగా వెళుతుందా? ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మరోసారి సంక్షోభం దిశగా వెళుతుందా? ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, యూనియన్ల మధ్య కొంతకాలంగా పెరుగుతున్న విభేదాలు పరిశ్రమను మరోసారి సమస్యల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు అంశం పెద్ద వివాదంగా మారింది. ఆ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, నిర్మాతలు మాత్రం దీనికి సుముఖంగా లేరని సమాచారం. ఒకవేళ నిర్మాతలు అంగీకరించకపోతే థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తుండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. దీంతో రాబోయే సినిమాల విడుదలలపై అనిశ్చితి నెలకొంటోంది.
ఇక యూనియన్ వ్యవహారాలు కూడా నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నాయి. బేటాలు, నైట్ షిఫ్ట్ లకు సంబంధించిన నిబంధనల విషయంలో మళ్లీ పేచీలు మొదలయ్యాయి. యూనియన్లు ప్రతిపాదిస్తున్న కొత్త నియమాలు నిర్మాణ ఖర్చులు పెంచుతున్నాయని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఈ అంశంపై కూడా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా ఏకంగా ఓ పెద్ద సినిమా షూటింగ్ ను యూనియన్ సభ్యులు అర్థంతరంగా ఆపివేసిన ఘటన పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటనతో నిర్మాతల్లో ఆందోళన మరింత పెరిగింది. షూటింగ్ లు మధ్యలో ఆగిపోతే తమకు భారీ నష్టాలు తప్పవని, ఇప్పటికే పెరిగిన బడ్జెట్ ల మధ్య ఇది మరింత భారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో వరుస పరిణామాల నేపథ్యంలో నిర్మాతలు కూడా సీరియస్ గా నిర్ణయాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే షూటింగ్ లు నిలిపివేయడం, లేదా కొత్త సినిమాలను వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమపై గట్టిగా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, యూనియన్లు ఒకే వేదికపైకి వచ్చి సమస్యలు చర్చించుకుంటే సరైన పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందని పలువురు సినీ ప్రియులు సూచిస్తున్నారు. ఏదమైనా.. ఇప్పటికే ఓటీటీ ప్రభావం, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న టాలీవుడ్ కు కొత్త వివాదాలు మరింత ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఆ పరిస్థితి త్వరగా చక్కబడకపోతే పరిశ్రమ మళ్లీ కష్టకాలంలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.