అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదు.. ఆ పెద్ద హీరోని లేపేయాలని ప్లాన్!
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముంబై జుహూ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముంబై జుహూ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణమైన దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్‌తో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగాయి. విచారణలో భాగంగా ఆయుధాల సరఫరా.. రవాణాలో కీలక పాత్ర పోషించిన నలుగురు నిందితులను (రాధ, బబిత, కునాల్, సుమిత్) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ముంబై పోలీసులకు అప్పగించారు. అమృత్సర్ నుంచి తుపాకులు, కార్ట్రిడ్జ్లను సమకూర్చుకుని.. మహిళల సహాయంతో ముంబైకి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసు విచారణలో అత్యంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల అసలు ప్లాన్ టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోవడం కాదని.. బాలీవుడ్‌కు చెందిన మరో హై-ప్రొఫైల్ పెద్ద హీరోని లేపేయాలని ప్లాన్ చేసినట్లు తేలింది. నిందితులు టార్గెట్ చేసిన ఆ బడా హీరో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. ముంబైకి వచ్చిన నిందితులు సదరు పెద్ద హీరో నివాసం వద్ద భద్రత చాలా కట్టుదిట్టంగా ఉండటంతో తమ ప్లాన్‌ను అమలు చేయలేకపోయారు.
సల్మాన్‌పై దాడి సాధ్యపడకపోవడంతో నిందితులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. సోషల్ మీడియా రీల్స్ ఆధారంగా టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి ప్రత్యేక పోలీసు భద్రత లేదనే విషయాన్ని గమనించి.. చివరి నిమిషంలో తమ టార్గెట్‌ను టైగర్ ష్రాఫ్‌కు మార్చారు. బాలీవుడ్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాలనే ఏకైక లక్ష్యంతోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యాండ్లర్ అనిల్ పండిట్ ఆదేశాల మేరకు షూటర్లు (హృతిక్, రెహాన్, ఫూల్ సింగ్) ఈ దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు.
మరోవైపు ఈ కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతున్న తప్పుడు ప్రచారంపై టైగర్ ష్రాఫ్ బృందం తీవ్రంగా స్పందించింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియా వేదికగా టైగర్ ష్రాఫ్ టీమ్ తమ మొదటి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఘటనకు సంబంధించి నటుడి పేరుతో వస్తున్న ఆడియోలు, తప్పుదోవ పట్టించే వార్తలను నమ్మవద్దని.. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని వారు స్పష్టం చేశారు.
అలాగే కృత్రిమ మేధ (AI) సాంకేతికత ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు, మార్ఫింగ్ క్లిప్‌లు, అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్‌ను ప్రమోట్ చేసే వ్యక్తులు, సోషల్ మీడియా పేజీలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టైగర్ ష్రాఫ్ టీమ్ హెచ్చరించింది. ప్రజలు, అభిమానులు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.