కమల్ క్షమాపణ అంత కాస్ట్లీనా?
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్.;
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాలో శింబు మరో ప్రధాన పాత్రలో కనిపించగా త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. అప్పుడెప్పుడో కమల్- మణిరత్నం కలిసి నాయగన్ సినిమా చేశారు. ఇప్పుడు మళ్లీ 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలను ఇంకాస్త పెంచుతూ థగ్ లైఫ్ సినిమాను చిత్ర యూనిట్ మొత్తం ఎడతెరిపి లేకుండా ప్రమోషన్స్ చేస్తుంది. అందులో భాగంగానే పలు నగరాలను తిరిగి థగ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరులో ఓ ఈవెంట్ చేయగా ఆ ఈవెంట్ లో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్స్ కన్నడిగులను తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఈ విషయంలో కమల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే అతని సినిమాను కర్ణాటక రాష్ట్రమంతటా బ్యాన్ చేస్తామని హెచ్చరించినప్పటికీ కమల్ మాత్రం తానేం తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పేది లేదని భీష్మించుకుని మరీ కూర్చున్నాడు.
అందులో భాగంగానే రిలీజ్ లో భాగంగా తన సినిమాకు రక్షణ కల్పించాలని కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయిస్తే, కర్ణాటక హై కోర్టు కూడా కమల్ ను కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమనే ఆదేశాలిచ్చింది. కానీ ఇప్పటివరకు కమల్ క్షమాపణలు చెప్పింది లేదు. థగ్ లైఫ్ రిలీజ్ కు మరి కొన్ని గంటలు మాత్రమే టైముంది. అయితే ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త ప్రచారమవుతుంది.
థగ్ లైఫ్ సినిమాను కన్నడలో బ్యాన్ చేయడం వల్ల ఈ సినిమాకు సుమారు రూ.15 కోట్ల నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వారం తర్వాత కన్నడలో థగ్ లైఫ్ రిలీజయ్యే ఛాన్సుంటుందని టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అది కుదిరే పనిలా కనిపించడం లేదు. మరి థగ్ లైఫ్ సినిమాకు కర్ణాటక ద్వారా వచ్చిన నష్టాన్ని మిగిలిన ఏరియాలు పూడ్చి కమల్ ను గట్టెక్కిస్తాయా అన్నది చూడాలి. కమల్ మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాయగన్ సినిమాను మించి థగ్ లైఫ్ ఉంటుందని చెప్తున్నాడు.