రెండు పడవల మీద ప్రయాణం.. వర్కౌట్ అవుతుందా?
అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తెలుగు, హిందీ చిత్రాలలో ఏకకాలంలో నటించడంపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.;
హీరోలకైనా.. హీరోయిన్స్ కైనా ఒక భాషలో ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే భాషలో వేరే సినిమాలో కూడా అవకాశం రావడం సహజమే. అయితే ఆ రెండు చిత్రాలు కూడా అనుకున్న సమయానికి విడుదల కావాలి అంటే.. సైన్ చేసిన రెండు చిత్రాలకి కూడా బ్యాలెన్స్ గా కాల్ షీట్స్ ను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా ఒకే సమయంలో రెండు చిత్రాల షూటింగ్లలో పాల్గొనడం అంటే.. ఏ నటీనటులకైనా సరే రెండు పడవల మీద ప్రయాణం లాంటిది అని చెప్పవచ్చు. అయితే ఆ రెండు సినిమాలు సక్సెస్ సాధించాయి అంటే మాత్రం ఆ నటీనటులకు క్రేజ్ మరింత పెరిగిపోతుంది. అయితే ఆ సక్సెస్ లభించాలి అంటే అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న మృనాల్ ఠాకూర్ కూడా ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తోంది. మరి ఈ ప్రయాణం ఆమెకు వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో కొత్తదనం నిండిన కథలతో అభిమానులను అలరిస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈమె.. సన్నాఫ్ సర్దార్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో తెరపై మెరవడానికి సిద్ధమవుతోంది.
అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తెలుగు, హిందీ చిత్రాలలో ఏకకాలంలో నటించడంపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే చిత్రంతోపాటు అటు హిందీలో ధో దీవానే సెహర్ మే వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. రెండు భాషలకు చెందిన ఈ సినిమాలను ఒకేసారి ఏకధాటిగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీని గురించి మృణాల్ మాట్లాడుతూ.. "కొన్ని కొన్ని సార్లు నాలో మంచి ప్లానర్ ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల విషయంలో నాకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం చాలా ఇష్టం. అటు నన్ను ఎంతగానో ఆరాధిస్తున్న తెలుగు అభిమానులను నిరాశపరచడం నాకు ఇష్టం లేదు.
అలాగే బాలీవుడ్ కూడా నాకు కంఫర్ట్ జోన్. కానీ నటిగా సరిహద్దులను దాటి నటించడమే నాకు ఇష్టం. పైగా ఇది సవాలుతో కూడుకున్న విషయం. కానీ ఇలాగే ఉండాలని నేను కలలు కన్నాను. చివరికి ఇప్పుడు సాధ్యమవుతోంది. ఇక ఈ రెండు చిత్రాలను ఏకకాలంలో చిత్రీకరించడంలో సహాయం చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ మృనాల్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఇటు తెలుగు అటు హిందీ రెండు చిత్రాలలో ఏకధాటిగా షూటింగ్లలో పాల్గొంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ ప్రయాణం ఈమెకు కలిసి రావాలి అంటే వచ్చే ఏడాది ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఒకవేళ ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అంటే మృణాల్ కి ఇక ఇండస్ట్రీలో తిరుగులేదు అని చెప్పవచ్చు.