నష్టాలపై నిర్మాత క్లారిటీ..

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతి సంవత్సరం అనేక చిత్రాలను నిర్మిస్తూ తనకంటూ బడా నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.;

Update: 2025-12-21 06:50 GMT

ఒకప్పుడు సినిమా ఫలితం అనేది హీరోపైన అలాగే ఎన్ని రోజులు.. ఎన్ని థియేటర్లలో ఆడింది అనే విషయం పైన ఆధారపడేది. కానీ ఈ మధ్య లెక్కలు మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఒక సినిమా హిట్ అయింది అని చెప్పడానికి బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలే ప్రధానంగా నిలుస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తమ సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవడానికి చాలామంది నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అనే వాదన ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.

పైగా వందల కోట్లు రాబడుతున్నట్లు పోస్టర్లు చూపించి మరీ అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక నిర్మాత నిజాయితీగా తన సినిమా హక్కులకి సంబంధించిన లెక్కల గురించి చెప్పి మరీ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇది చూసిన నెటిజన్స్ ఈయన కదా నిజాయితీ కలిగిన నిర్మాత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆయన ఎవరు? ఏ చిత్రానికి విడుదలకు ముందే నష్టాలు వచ్చాయి? ఏ విషయంపై ఆయన నిజాయితీగా స్పందించారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతి సంవత్సరం అనేక చిత్రాలను నిర్మిస్తూ తనకంటూ బడా నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తొలిసారి ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు మార్కెట్ పడిపోయిందని.. అనుకున్నంత స్థాయిలో హక్కులను అమ్మలేకపోయానని విశ్వప్రసాద్ తెలిపారు.

అందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.." చివరికి నాన్ థియేట్రికల్ హక్కులను మాత్రమే అమ్మగలిగాము..కానీ మేము ఊహించిన ధరను పొందలేకపోయాము. మార్కెట్ పడిపోయింది" అంటూ ఆయన తెలిపారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హక్కులకు సంబంధించి నిర్మాత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా ప్రభాస్ సినిమాలు అంటే భారీ ఎత్తున అంచనాలు ఏర్పడతాయి. కానీ ది రాజా సాబ్ సినిమాకి ఎటువంటి అంచనాలు లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

ఇకపోతే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేస్తున్నారు. పైగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తోపాటు పలువురు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. నిధి అగర్వాల్ , రిద్దీ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పైగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ భారీ ఎత్తున ఈ సినిమా కోసం బడ్జెట్ కేటాయించారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఇలా భారీ తారాగణం ఈ సినిమా కోసం పనిచేసినా.. ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో మార్కెట్ ఏర్పడకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి ఈ సినిమా విడుదల తర్వాత అయినా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News