మళ్లీ టికెట్ ప్లీజ్ అంటున్నారా?
క్యూలో తోసుకుని...దెబ్బలు తిని మరీ టికెట్ సంపాదించేంత అభిమానం తెలుగు వాళ్లకే సాధ్యమని కొన్ని దశాబ్దాల పాటు రుజువు చేసారు.;
టికెట్ కౌంటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తోందా? బుకింగ్ కౌంటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయా? ఆన్ లైన్ విధానం కంటే హాఫ్ లైన్ విధానానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే అనాలి. ఒకప్పుడు థియేటర్ ముందు టికెట్ కౌంటర్లు ప్రేక్షకులతో కళకళలాడేవి. బొమ్మ వేయడానికి గంట ముందు కౌంటర్ల వద్ద లైన్ లో నిలబడి టికెట్లు కొనుకుని సినిమా చూసేవారు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే టికెట్ల కోసం కొట్లాటే జరిగేది.
క్యూలో తోసుకుని...దెబ్బలు తిని మరీ టికెట్ సంపాదించేంత అభిమానం తెలుగు వాళ్లకే సాధ్యమని కొన్ని దశాబ్దాల పాటు రుజువు చేసారు. అయితే కాల క్రమంలో ఆన్ లైన్ టికెట్ విధానం రావడంతో నెమ్మది గా హాఫ్ లైన్ టికెటింగ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు అందరూ ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుని సినిమాకెళ్తున్నారు. థియేటర్ల వద్ద టికెట్ కొనడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది.
ఒకప్పటిలా థియేటర్ల వద్ద క్యూలు లేవు. అంత ఎగబడి టికెట్ కొని చూసే పరిస్థితులు అంతకన్నా లేవు. అయితే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఓ రెండు సినిమాల విషయంలో బుకింగ్స్ అన్నవి థియేటర్ల వద్ద జరగడం విశేషం. `కుబేర`, `కన్నప్ప` చిత్రాలకు చాలా మంది కౌంటర్ల వద్దే టికెట్ కొని థియేటర్లో సినిమా చూసారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సన్నివేశం కనిపించింది.
ఈ నేపథ్యంలో ఓ కారణం తెరపైకి వస్తోంది. ఇప్పుడు థియేటర్ల సంఖ్య బాగా పెరిగింది. ఒకే సినిమాని చాలా థియేటర్లో వేస్తున్నారు. దీంతో ఏదో థియేటర్లో టికెట్ దొరుకుతుందనే ధీమా ప్రేక్షకుడిలో బలంగా మొదలైంది. దీంతో ట్యాక్స్ లు..టికెట్ ఫీజుల బారి నుంచి తప్పించుకునేందుకు థియేటర్ వద్దే టికెట్ కొంటున్నారు. ఇది మంచి పరిణామమే. ఆన్ లైన్ లో అదనంగా చెల్లించే బధులు థియేటర్ వద్ద కొంటే రూపాయి తగ్గుతుంది. సినిమాకొచ్చాం అన్న కళ కనబడుతుంది. వీలైనంత వరకూ ప్రేక్షకు లు థియేటర్ వద్ద టికెట్ కొనమనే యాజమాన్యాలు కూడా సూచిస్తున్నాయి.