రాజా సాబ్ సెన్సార్ పూర్తి.. ఈ సారి కూడా డార్లింగ్ అదే రూట్ లో..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్. ఈ రోజుల్లో, ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ ఫేమ్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్. ఈ రోజుల్లో, ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ ఫేమ్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
జనవరి 9న రాజా సాబ్ రిలీజ్
ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ది రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండగా, రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న రాజా సాబ్
సెన్సార్ పూర్తి చేసుకున్న ది రాజా సాబ్ మూవీ సెన్సార్ బోర్డు నుంచి యూ/ఎ సర్టిఫికెట్ ను అందుకుంది. అంటే ఈ సినిమాను తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు కూడా చూడొచ్చన్నమాట. అయితే సెన్సార్ పూర్తయ్యాక ది రాజా సాబ్ మూవీ 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు 3 గంటల రన్ టైమ్ చాలా కామనైపోయింది.
జనవరి 8న ప్రీమియర్లు వేసే ప్లాన్
బాహుబలి తర్వాత పెద్ద సినిమాలన్నీ ఎక్కువగా 3 గంటల పైన నిడివితోనే వస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు కూడా అన్నీ 3 గంటల కంటే ఎక్కువే రన్ టైమ్ ను కలిగి ఉన్నాయి. ఇప్పుడు రాజా సాబ్ కూడా 3 గంటలకు పైగానే రన్ టైమ్ తో రిలీజవనుంది. మరి సంక్రాంతి రేసులో మొదటిగా రిలీజవుతున్న రాజా సాబ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాకు ముందు రోజు రాత్రి నుంచి అంటే జనవరి 8 రాత్రి నుంచే ప్రీమియర్లు వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ కీలక పాత్ర లో చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.