అల్లు వారి 75 అడుగుల డాల్బీ స్క్రీన్ టికెట్ రేటు ఎంత బాస్?
సినీ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ మల్టీఫ్లెక్స్ లో ప్రత్యేకత ఏమంటే.. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది.;
ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగి.. ఆ వీడియోలకు భారీ ఎత్తున వ్యూస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కోకాపేటలో స్టార్ట్ చేస్తున్న అల్లు సినిమాస్ మల్టీఫ్లెక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం.. ఈ మల్టీఫ్లెక్స్ ను తొలిసారి ప్రేక్షకులకు రేపు (ఫిబ్రవరి 12) అందుబాటులోకి తెస్తున్నారు. సినీ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ మల్టీఫ్లెక్స్ లో ప్రత్యేకత ఏమంటే.. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. దీన్నో విజువల్ వండర్ గా చెబుతున్నారు.
అలాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీన్లో సినిమా చూసే అనుభవం మరో స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఈ మల్టీ ఫ్లెక్స్ లో నాలుగు స్క్రీన్లు ఉంటాయి. అందులో ఇస్పెషల్ డాల్బీ విజన్ స్క్రీన్. ఈ స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ గా గుర్తింపు పొందిన దీన్ని త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతానికి భారతదేశంలో కేవలం మూడు మాత్రమే డాల్బీ విజన్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫూణెలో 55 అడుగుల స్క్రీన్ అయితే.. బెంగళూరులో ఉన్న 65 అడుగుల స్క్రీన్ రెండోది. తాజాగా హైదరాబాద్ లోని కోకాపేటలో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇంతకూ ఈ సినిమా థియేటర్ టికెట్ ఎంత ఉంటుంది? అన్నదిప్పడు ఆసక్తికర చర్చగా మారింది.
సినీ వర్గాల నుంచి.. మార్కెట్ అంచనాల ప్రకారం చూస్తే.. మామూలు రోజుల్లో రూ.500 చొప్పున ఒక్కో టికెట్ ఉంటుందని.. అదే కొత్త సినిమా విడుదల వేళలో మాత్రం రూ.వెయ్యి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి.. దీనికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అంటే.. చట్టంలో ఉన్న వెసులుబాటు ఈ ధియేటర్ లో టికెట్ ధరల్ని ప్రత్యేకంగా పెంచుకునే వీలు కల్పిస్తుందని చెబుతన్నారు. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీఫ్లెక్స్ సెగ్మెంట్ లోకి రావటం వల్ల.. డాల్బీ విజన్ స్క్రీన్ కు భారీగా టికెట్ ధరల్ని ఫిక్స్ చేసుకునే వీలుంది. ఈ ప్రత్యేక స్క్రీన్ ను మాత్రం ఉగాది సందర్భంగా విడుదలయ్యే ఉస్తాద్ భగత్ సింగ్ తో షురూ చేస్తారని చెబుతున్నారు. ఇదే స్క్రీన్ లో ధురంధర్ 2 ను కూడా ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ఏమైనా ఈ థియేటర్ సినీ ప్రియులకు విజువల్ ఫీస్ట్ గా మారుతుందని చెప్పాలి.