దర్శకుల క్రియేటివిటీని సీబీఎఫ్‌సి చంపేస్తుందా?
మరో కోణంలో చూస్తే..సెన్సార్‌షిప్ అనేది స్థానిక సమాజ విలువల పరిరక్షణకు- సాంస్కృతిక సమతుల్యతను కాపాడటానికి ఒక తప్పనిసరి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది.
భారతదేశంలో చాలామంది ఫిలింమేకర్స్ సీ.బీ.ఎఫ్.సి తమ సృజనాత్మకతను చంపేస్తోందని ఆవేదన చెందారు. జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ప్రతిసారీ సీబీఎఫ్.సి తన సినిమాలకు కట్స్ చెప్పడాన్ని వ్యతిరేకించారు. సెన్సార్ బృందంపై తీవ్రంగా ఆరోపించారు. ఇంకా బాలీవుడ్ లో దిగ్గజ దర్శకులు సెన్సార్ కట్స్ సినిమా ఫ్లోని దెబ్బతీసాయని ఆరోపించారు. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ని అర్థం చేసుకోకుండా సెన్సార్ సభ్యులు కట్స్ చెప్పారని ఆవేదన చెందారు.
ఇప్పుడు ఎమోషన్ ని పీక్స్ లో ఎలివేట్ చేస్తూ తనదైన సృజనాత్మకతతో వయోజన కంటెంట్ ని ఒప్పించే మేటి దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలాన్ కి ఉన్న పేరు దృష్ట్యా అతడు రూపొందించిన `ది ఒడిస్సీ` చిత్రానికి ఇండియన్ సెన్సార్ షిప్ ఎలాంటి కట్స్ వేస్తుందోననే ఆందోళన నెలకొంది.
ది ఒడిస్సీ గ్రీక్ పురాణాల ఆధారంగా రూపొందించిన హిస్టారికల్ వారియర్ డ్రామా చిత్రం. దీనికి నోలాన్ తరహా సృజనాత్మక అంశాలు, భారీ వీఎఫ్ఎక్స్ - యాక్షన్ దృశ్యాలతో చరిత్రను సృష్టించబోతోంది. భారతదేశంలో ఇలాంటి సినిమా నభూతోనభవిష్యతి అవుతుందని ఫ్యాన్స్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. బాట్మాన్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, ఓపెన్ హీమర్ లాంటి హాలీవుడ్ సినిమాలలో నోలాన్ సృజనాత్మకతను విపరీతంగా అభిమానించిన వారంతా ఇప్పుడు ది ఒడిస్సీ రాక కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో భారతదేశంలో సెన్సార్ కట్స్ ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ వాతావరణం ఫ్యాన్స్ లో అలుముకుంది.
అయితే నోలాన్ రేంజు ఆలోచనలను అర్థం చేసుకునే తెలివితేటలు భారతీయ సెన్సార్ బోర్డ్ కు లేవని అనుకుంటున్నారా? సెన్సార్ సభ్యులు మన ఆడియెన్ సెన్సిబిలిటీస్ - నార్మ్స్ ఆధారంగానే కట్స్ చెబుతారని అనుకుంటున్నారా? నోలాన్ సినిమాని యథాతథంగా చూడాలని ఆశపడే అభిమానులకు సెన్సార్ పెద్ద ఝలక్ ఇస్తుందని భావిస్తున్నారా? అంటే.. దీనిని రెండు కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
గ్లోబల్ సినిమా యుగంలో విదేశీ చిత్రాల్లోని అడల్ట్ కంటెంట్‌ను భారతీయ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సి) కత్తిరించడం అనేది నిస్సందేహంగా అంతర్జాతీయ దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను హరించే ప్రక్రియే అవుతుంది. ఒక దర్శకుడు తాను అనుకున్న కథను, అందులోని భావోద్వేగాలను లేదా సామాజిక వాస్తవాలను ప్రేక్షకుడికి లీనమయ్యేలా చూపించడానికి ప్రతి సన్నివేశాన్ని ఎంతో సృజనాత్మకంగా డిజైన్ చేస్తారు. హాలీవుడ్‌లో ఇప్పటికే ఆర్-రేటింగ్ ద్వారా కేవలం వయోజనులు మాత్రమే చూడాలనే హెచ్చరికతో విడుదలయ్యే చిత్రాలపై, మళ్లీ స్థానిక బోర్డులు కత్తెర వేయడం వల్ల సదరు సినిమా ఆత్మ, కథా గమనం దెబ్బతింటాయి. సమాచార సాంకేతికత పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన కంటెంట్‌ను వీక్షించే డిజిటల్ యుగంలో ఇలాంటి మితిమీరిన కోతలు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రేక్షకుల పరిణతిని తక్కువ చేసి చూపించడమే కాకుండా.. సృజనాత్మక విలువులను కరిగించివేస్తాయని విశ్లేషిస్తున్నారు.
మరో కోణంలో చూస్తే..సెన్సార్‌షిప్ అనేది స్థానిక సమాజ విలువల పరిరక్షణకు- సాంస్కృతిక సమతుల్యతను కాపాడటానికి ఒక తప్పనిసరి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది. ప్రతి దేశానికి, సమాజానికి విభిన్నమైన సామాజిక నిబంధనలు, కుటుంబ విలువలు, సాంస్కృతిక పరిమితులు ఉంటాయి. విదేశాలలో రొటీన్ గా ఆమోదించే నగ్నత్వం.. హింస వంటివి మన దేశంలో ఆమోదించడం సులువు కాదు. ఇక్కడి ప్రజల ఆలోచనలు కుటుంబ జీవనశైలికి అవి భిన్నమైనవి. అలాంటివాటిని థియేటర్లలో ప్రదర్శితమయ్యేటప్పుడు అవి సమాజంలో ఎక్కువమంది ప్రజలపై.. ముఖ్యంగా యువతపై చూపే ప్రభావాన్ని నియంత్రించడం ప్రభుత్వాల బాధ్యతగా మారుతుంది. కాబట్టి సృజనాత్మక స్వేచ్ఛకు గౌరవం ఇస్తూనే.. సమాజిక అంశాలు.. సాంస్కృతిక సెన్సిబిలిటీస్ దృష్ట్యా ఈ నియంత్రణ ప్రక్రియను పూర్తిగా తోసిపుచ్చలేమని ఒక వర్గం విశ్లేషిస్తోంది.