ఫ్యామిలీమ్యాన్ 3.. ఈశాన్యంలోని కర్కశ కంత్రీగాళ్ల స్టోరి
సినిమాలకు వెబ్ సిరీస్ లు ప్రత్యామ్నాయంగా మారతాయా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన మొదటి జనరేషన్ సిరీస్ `ది ఫ్యామిలీమ్యాన్`.;
సినిమాలకు వెబ్ సిరీస్ లు ప్రత్యామ్నాయంగా మారతాయా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన మొదటి జనరేషన్ సిరీస్ `ది ఫ్యామిలీమ్యాన్`. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ప్రతిభ వెబ్ సిరీస్ లపై అన్ని ప్రతికూల ఆలోచనల్ని పటాపంచలు చేసింది. మధ్యతరగతికి చెందిన ఫ్యామిలీమ్యాన్ పాత్రలో జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డెవిల్స్ కి సహకరించే తెలివైన తెలివితక్కువ భార్యగా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి నటించారు. ఈరోజుల్లో టీనేజర్స్ ప్రేమకలాపాలను కూడా ఫ్యామిలీమ్యాన్ సిరీస్ లో ఎంతో తెలివిగా చూపించారు రాజ్ అండ్ డీకే. తీవ్రవాదులు ఎంత ప్రమాదమో ఇంట్లో ఉండే టీనేజర్స్ అంతే ప్రమాదకరమని ఫ్యామిలీమ్యాన్ కి పాఠం నేర్పించే విధానం హాస్యంతో అలరిస్తుంది. అందుకే ఫ్యామిలీమ్యాన్ గ్రౌండ్ లెవల్లో ప్రతి ఆడియెన్ ని ఆకర్షించడంలో సఫలమైంది.
ఇప్పటికే రెండు సీజన్లు బంపర్ హిట్లు కొట్టాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా ది ఫ్యామిలీమ్యాన్ అసాధారణ ప్రదర్శన ఎప్పుడూ చర్చగా మారుతోంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ తివారీ అనే రా ఏజెంట్ గా మనోజ్ భాజ్ పాయ్ నటించారు. ప్రభుత్వ ఉద్యోగి చాలీ చాలని జీతం, సౌకర్యాలు, మధ్యతరగతి సమస్యలను తెరపై ఆవిష్కరిస్తూనే, దేశంలో తెగబడుతున్న అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదుల భరతం పట్టే అధికారిగా అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. మొదటి భాగంలో కశ్మీర్ తీవ్రవాదాన్ని, రెండో భాగంలో శ్రీలంక ఎల్.టి.టి.ఇ తీవ్రవాదాన్ని ఎంతో తెలివిగా ఇన్ బిల్ట్ చేసారు రాజ్ అండ్ డీకే.
ఇప్పుడు ఈశాన్య భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన కరుడుగట్టిన శక్తులను రాజ్ అండ్ డీకే పరిచయం చేయబోతున్నారు. ఈసారి విలన్ మనునపటి కంటే కర్కశమైనవాడు.. క్రూరుడు.. అత్యంత దుర్భేధ్యమైనవాడు. ఈ పాత్ర పేరు రుక్మా. జైదీప్ అహ్లావత్ రుక్మాగా నటిస్తున్నాడు. అతడు మునుపటి విలన్ల మాదిరిగా కాకుండా శ్రీకాంత్ ను వెంటాడే నీడలా ఉంటాడు. కుటుంబం లేని `ఫ్యామిలీమ్యాన్`గా అతడు కనిపిస్తాడు. ఈ సంక్లిష్టమైన పాత్ర శ్రీకాంత్ ఇప్పటివరకు ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన ప్రత్యర్థిగా ఉంటుంది.
`సీజన్ 3` నాగాలాండ్ -అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశ ఈశాన్య ప్రాంతంలో సాగుతుంది. ఈ ప్రాంతాలలో దశాబ్ధాలుగా పాతుకుపోయిన నక్సలిజం, మావోయిజం వంటి టాపిక్స్ ని, పొలిటికల్ స్టంట్ ని రాజ్ అండ్ డీకే టచ్ చేస్తున్నారని కూడా కథనాలొస్తున్నాయి. అయితే సీజన్ 2 చివరిలో దీనిని ప్లాన్ చేసినట్లు కృష్ణ డికె వెల్లడించారు. ఈ ప్రాంతం ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి - శక్తి ఇప్పుడు కథను నడిపిస్తాయి. ఎమోషన్స్ డెప్త్ కూడా ఆకట్టుకుంటుంది. ఈశాన్య ప్రాంతం ఇకపై కేవలం నేపథ్యం కాదు, కథనాన్ని నడిపించే కీలక అంశం అని అన్నారు. నేపథ్యం మారినా ఇందులో థీమ్ ఎక్కడా మారదు. అది అండర్ కరెంట్ గా రన్ అవుతూనే ఉంటుంది. శ్రీకాంత్ తన మధ్యతరగతి జీవితంతో రహస్య మిషన్లను కొనసాగిస్తాడు. ప్రేక్షకులు అప్పటికే తెలిసిన ముఖాలను చూస్తారు. జేకేగా షరీబ్ హష్మి, ప్రియమణి సుచిత్రగా నటిస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది. శ్రీకాంత్ తివారీ జీవితంలో అత్యంత కష్టమైన మిషన్ ని నడిపిస్తాడు. కొత్త ప్రత్యర్థి రుక్మాతో అతడి పోరాటం ఎలా సాగిందో తెరపైనే చూడాలి.