దళపతి టు CM: విజయ్ చారిత్రక విజయంపై 'వారిసు' బృందం భావోద్వేగం

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ఆధిపత్యాన్ని చెరిపివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు దళపతి విజయ్.;

Update: 2026-05-05 07:38 GMT

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ఆధిపత్యాన్ని చెరిపివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు దళపతి విజయ్. ఈ చారిత్రక విజయంపై ఆయనతో `వారిసు` (వారసుడు) వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు- దర్శకుడు వంశీ పైడిపల్లి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఒక స్టార్ హీరోగానే కాకుండా... ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా విజయ్ ప్రయాణం ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ వ్యక్తిత్వం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఆయనలోని వినయమే ఈ స్థాయికి చేర్చిందని కొనియాడారు. ``విజయ్ సార్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తుంటారు.. ఆయన సిద్ధాంతాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అందుకే నేను వెనుకాడకుండా ఆయనతో సినిమా నిర్మించాను`` అని రాజు పేర్కొన్నారు. విజయ్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలో ఆయనతో తాను ఫోన్ టచ్‌లో ఉన్నానని.. త్వరలో జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా హాజరవుతానని దిల్ రాజు వెల్లడించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కాబోయే తమిళనాడు సీఎం విజయ్‌లతో దిల్ రాజుకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

మరోవైపు విజయ్‌ను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి ఆయనలోని మౌనమే అతిపెద్ద శక్తి అని అభివర్ణించారు. ``విజయ్ సార్‌కు ఆలోచనల్లో స్పష్టత ఎక్కువ. ప్రజల ప్రేమ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. ఆ రుణాన్ని సేవ ద్వారా తీర్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు`` అని వంశీ గుర్తు చేసుకున్నారు. సినీ న‌టుడిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం సామాన్యం కాదని.. అది కేవలం విజయ్ వంటి బలమైన సంకల్పం ఉన్న వ్యక్తికే సాధ్యమని ఆయన ప్రశంసించారు. ఆపదలో ఉన్నా లేదా ఒత్తిడిలో ఉన్నా విజయ్ చూపించే నిలకడ ఆయనను ఒక గొప్ప నాయకుడిగా నిలబెడుతుందని వంశీ ధీమా వ్యక్తం చేశారు.

ఒక స్టార్ హీరో ఇప్పుడు రాష్ట్ర ప‌రిపాల‌నా బాధ్యతలు చేపట్టబోతుండటంతో `వారిసు` బృందం విజయ్‌తో మరో సినిమా చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే విజయ్ తన రాజకీయ ప్రయాణం కోసం సినిమాలకు విరామం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన దృష్టి అంతా పరిపాలనపైనే ఉందని స్పష్టమవుతోంది. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సత్సంబంధాలు, ఆయన తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి.. దక్షిణాది రాష్ట్రాల మధ్య సినీ రంగ పరంగా సయోధ్య కుదర్చడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతిమంగా వెండితెరపై `వారసుడు`గా అలరించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు నిజమైన `వారసుడు`గా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ద‌ళ‌ప‌తితో పని చేసిన వారు చెప్పినట్లుగా.. అత‌డిలోని అంకితభావం.. వినయం రాజకీయాల్లోనూ తిరుగులేని విజయాన్ని అందించాయి. ఒక పక్కా వ్యూహంతో.. నిశ్శబ్దంగా తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్ ప్రయాణం భ‌విష్య‌త్ తరాలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవనుంది.

Tags:    

Similar News