సినిమా సెట్లలో కార్మికుల భద్రత: మరణాల వేళ‌ టాలీవుడ్‌లో ఎవ‌రు భ‌రోసా?

ఒక ప్రముఖ హిందీ దర్శకుడి చిత్రాల ప్రొడక్షన్‌లో జరిగిన వరుస ప్రమాదాలు, కార్మికుల మరణాలు ప్రస్తుతం భార‌త‌దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Update: 2026-06-28 02:30 GMT

ఒక ప్రముఖ హిందీ దర్శకుడి చిత్రాల ప్రొడక్షన్‌లో జరిగిన వరుస ప్రమాదాలు, కార్మికుల మరణాలు ప్రస్తుతం భార‌త‌దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సదరు దర్శకుడి సినిమాల సెట్స్‌లో ఇప్పటివరకు మొత్తం నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) అధ్య‌క్షుడు ఆరోపించారు. గతంలో హిందీ అగ్ర ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించిన ఒక క్లాసిక్ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరు కార్మికులు, ఆ తర్వాత 2016లో వచ్చిన మరొక చిత్రంలో సెట్ వేస్తుండగా ఒక కార్మికుడు మరణించారని గుర్తు చేశారు. ఇప్పుడు 2026లో షూటింగ్ జరుపుకుంటున్న `పాన్ ఇండియా మూవీ` సెట్‌లో కరెంట్ షాక్‌తో మరొకరు చనిపోవడంతో ఈ సంఖ్య నాలుగుకు చేరిందని.. ఇది తీవ్రమైన నిర్లక్ష్యమేనని ఆయన మండిపడ్డారు. అంతేకాదు దర్శ‌కుడే మ‌ర్డ‌ర్ చేసాడంటూ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షులు.

సినిమా సెట్లలో పెద్ద ప్రొడ్యూసర్లు లేదా అగ్ర నటులు ప్రమాదాల బారిన పడి చనిపోయినట్లు ఎప్పుడూ వార్తలు రావని, కేవలం రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్మికులే ఎందుకు బలైపోతున్నారని కూడా ఫెడ‌రేష‌న్ నిల‌దీసింది. ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవడానికి భద్రతా చర్యలను పూర్తిగా గాలికొదిలేయడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. కాగా ఏఐసిడ‌బ్ల్యూఏ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు, క్రిమినల్ కేసు డిమాండ్లపై సదరు దర్శకుడు కానీ, లేదా ఆయన నిర్మాణ సంస్థ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకుండా మౌనంగా ఉండటం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని ఆయ‌న ఆరోపించారు.

టాలీవుడ్- కోలీవుడ్‌లలో ప్రమాదాలు- పరిహారంలో ఫెడరేషన్ పాత్ర

ఇలాంటి ప్రమాదాలు కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ జరిగిన సందర్భాలు ఉన్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు ఎదురైనప్పుడు బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో స్థానిక సినీ కార్మిక ఫెడరేషన్లు (ఉదాహరణకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, లేబర్ ఫెడరేషన్) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరేషన్ ప్రతినిధులు రంగంలోకి దిగి సదరు నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతారు. కార్మికుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌తో పాటు.. ప్రొడక్షన్ హౌస్ తరపున తక్షణ ఆర్థిక సహాయం అందేలా చూసే పూర్తి బాధ్యతను ఫెడరేషనే భుజాన వేసుకుంటుంది.

కార్మిక కుటుంబాలకు అండ

తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) విషయానికి వస్తే.. సెట్స్‌లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక కుటుంబాలకు భరోసాగా నిలిచిన అనేక సందర్భాలు ఉన్నాయి. గతంలో ప‌లు పెద్ద‌ సినిమాల షూటింగ్స్ (ఉదాహరణకు `ఆచార్య` వంటి భారీ చిత్రాల సెట్లు) సమయంలో ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినప్పుడు లేదా గాయపడినప్పుడు, టాలీవుడ్ నిర్మాతలు -అగ్ర హీరోలు మానవత్వంతో స్పందించారు. కేవలం నిబంధనల ప్రకారం వచ్చే ఇన్సూరెన్స్ మొత్తానికే పరిమితం కాకుండా... బాధిత కుటుంబాల పిల్లల చదువుల కోసం.. వారి ఇళ్ల నిర్వహణ కోసం రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు భారీ ఆర్థిక సహాయాన్ని చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే అగ్ర హీరోలు తమ సొంత ట్రస్ట్‌ల ద్వారా కూడా అండగా నిలుస్తున్నారు.

కార్మికుల రక్షణ కోసం ఆన్-సెట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

భవిష్యత్తులో ఇలాంటి ప్రాణనష్టాలు జరగకుండా ఉండాలంటే నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు ఆన్-సెట్ కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి భారీ సెట్ వద్ద తప్పనిసరిగా క్వాలిఫైడ్ `సేఫ్టీ ఆఫీసర్`ను నియమించాలి. ఎలక్ట్రికల్ వైరింగ్, క్రేన్లు, ఫైర్ స్టంట్స్ జరిగే ప్రాంతాలలో అధునాతన రక్షణ పరికరాలను (పిపిఇ కిట్స్‌, గ్లోవ్స్, హెల్మెట్లు) కార్మికులకు అందించాలి. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా సెట్ లోపలే ఒక `మొబైల్ మెడికల్ అంబులెన్స్`, `ఫస్ట్-ఎయిడ్ టీమ్‌`ను అందుబాటులో ఉంచాలి. అన్నింటికంటే ముఖ్యంగా, షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రతి టెక్నీషియన్... రోజువారీ కార్మికుడికి గ్రూప్ ఇన్సూరెన్స్ (బీమా) చేయించడం నిర్మాతల ప్రాథమిక బాధ్యత కావాలి. టాలీవుడ్ లో కొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఈ నియ‌మాల‌ను పాటిస్తున్నాయ‌నే స‌మాచారం ఉంది.

Tags:    

Similar News