ప్రాంతాల పేరుతో సినిమాలను విభజించొద్దు
ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత బన్నీ వాసు తాజాగా స్పందిస్తూ టైటిల్ మార్పు గురించి వస్తున్న ప్రచారానికి పూర్తి విరామం పలికారు.
ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇడుపు కాయితం సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టైటిల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తెలంగాణ గ్రామీణ భాషలో వినిపించే ఈ పదానికి విడాకుల పత్రం అనే అర్థం ఉండటంతో, కొందరు నెటిజన్లు టైటిల్‌ను వ్యంగ్యంగా ట్రోల్ చేయగా, మరికొందరు తెలంగాణ భాషా ప్రత్యేకతను సమర్థిస్తూ స్పందించారు. దీంతో ఈ అంశం క్రమంగా ప్రాంతీయ భాష, యాసలపై చర్చగా మారింది.
ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత బన్నీ వాసు తాజాగా స్పందిస్తూ టైటిల్ మార్పు గురించి వస్తున్న ప్రచారానికి పూర్తి విరామం పలికారు. కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ను సెలెక్ట్ చేశామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సినిమా మొత్తం కథ ఈ టైటిల్ చుట్టూనే తిరుగుతుందని, అందుకే దానిని మార్చే ఆలోచనే లేదని ఆయన తెలిపారు.
డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, తన ప్రాంతీయ సంస్కృతి, భాష, కుటుంబ సంబంధాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించారని బన్నీ వాసు చెప్పారు. కథలోని ఎమోషన్ ను ఎంతో నేచురల్ గా ప్రతిబింబించే పదమే ఇడుపు కాయితం అని, అందుకే అదే టైటిల్‌గా ఖరారు చేశామని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ కొంత ఆందోళన కలిగించినా, ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితమయ్యే కథ కాదని, కుటుంబ సంబంధాలు, ఎమోషన్స్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందుతోందని తెలిపారు.
ప్రాంతాల పేరుతో సినిమాలను విభజించడం సరైన విధానం కాదని బన్నీ వాసు అన్నారు. ఒక ప్రాంతానికి చెందిన కథ అయినా, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. అదే కారణంతో విదేశాల్లో రూపొందిన హాలీవుడ్ సినిమాలను కూడా భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఇక సోషల్ మీడియాలో భాషలు, యాసలను అవమానించే కామెంట్స్ చేయడం వల్ల అనవసరమైన విభేదాలు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సున్నితమైన అంశాలపై స్పందించే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని, ప్రాంతాల మధ్య దూరం పెంచే పోస్టులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ, సినిమా రిలీజ్ తర్వాత కథే అన్ని సందేహాలకు సమాధానం చెబుతుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది.