మరో 30 ఏళ్లు నిలబడతా..
తనను ఇన్ని సంవత్సరాలుగా సినిమాల ద్వారా ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు మంచి చేకూర్చాలనే ఒక ఆశయంతో ఈ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టానని తెలిపారు విజయ్ దళపతి.;
ఎన్టీఆర్, ఎంజీఆర్ కాలం నుంచే చాలామంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలోకి అడుగుపెట్టి సత్తా చాటారు. ముఖ్యంగా సినిమాల ద్వారా తమను ఆదరించిన ప్రజలకు మంచి చేకూర్చాలనే ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టి రాష్ట్రాలను సుభిక్షం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే చాలామంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతూ.. ప్రజల మేలుకొరకు పని చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
తనను ఇన్ని సంవత్సరాలుగా సినిమాల ద్వారా ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు మంచి చేకూర్చాలనే ఒక ఆశయంతో ఈ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టానని తెలిపారు విజయ్ దళపతి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో జననాయగన్ అనే సినిమా చేస్తున్నారు. జన నాయకుడు అంటూ తెలుగులో.. అలాగే జననేత అని హిందీలో డబ్బింగ్ వెర్షన్లో విడుదల చేస్తున్నారు. జనవరి 9న 2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో లాంచ్ ను మలేషియాలో చాలా గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు విజయ దళపతి. అందులో భాగంగానే మరో 30 సంవత్సరాలు నిలబడతాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
అసలు విషయంలోకి వెళ్తే విజయ్ దళపతి మాట్లాడుతూ.. "ప్రస్తుతం నేను నటిస్తున్న జననాయగన్ సినిమా నా చివరి సినిమా. ఈ సినిమా తర్వాత నేను సినిమాలకు దూరం కాబోతున్నాను. నాకోసం ఎంతోమంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. అలా ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారికోసం మరో 30 సంవత్సరాలు నేను నిలబడతాను. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే నేను సినిమాలకు స్వస్తి పలుకుతున్నాను" అంటూ విజయ్ దళపతి తెలిపారు. మొత్తానికైతే తనను సినిమాల ద్వారా ఆదరించిన ప్రేక్షకులకు, ప్రజలకు మంచి చేకూర్చాలని నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోనే సెటిల్ కాబోతున్నారు విజయ్ దళపతి. మరి ఈయనకు రాజకీయం ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా విషయానికి వస్తే .. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని వెంకట కే నారాయణ, జగదీష్ పళని స్వామి, లోహిత్ ఎంకే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్ , ప్రియమణి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.