జూన్ -1 టాలీవుడ్‌కి ముంచు కొచ్చే ముప్పు?
తెలుగు చిత్రసీమకు ఎప్పుడు ఏ రకమైన సమస్య ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. మునుముందు పెద్ద సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి.;
తెలుగు చిత్రసీమకు ఎప్పుడు ఏ రకమైన సమస్య ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. మునుముందు పెద్ద సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. కమల్ హాసన్ `థగ్ లైఫ్` జూన్ 5న వస్తోంది. అలాగే పవన కళ్యాణ్ `హరి హర వీరమల్లు` కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు పెద్ద సమస్యను ఎదుర్కోనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు సీరియస్ గా నిర్ణయం తీసుకున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎగ్జిబిటర్లతో సినీపెద్దలు ఎవరూ మంతనాలు సాగించినది లేదు. పర్సంటేజీ విధానంలో థియేటర్లను నడపడం గిట్టుబాటు కాదని కొందరు పంపిణీదారులు, పంపిణీ రంగంలో ఉన్న నిర్మాతలు వాపోతున్నారట. వారికి నష్టాలు మిగులుతాయని భయపడుతున్నారట. అయితే పర్సంటేజీ విధానం లాభమా? నష్టమా? అనేదానిలోను ఏకాభిప్రాయం కుదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. మెజారిటీ వర్గం ఎగ్జిబిటర్లు (ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు) పర్సంటేజీ విధానానికి కట్టుబడ్డామని ఇటీవల తీర్మానించారు. కానీ కొందరు మాత్రం ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. థియేటర్ అంటే టికెట్ రూపంలోనే కాదు క్యాంటీన్, తినుబండారాలు, పార్కింగ్ వంటివి కీలకమైనవి. వాటి ద్వారా వచ్చే ఆదాయం చాలా పెద్దది. అందువల్ల కొందరు నిర్మాతలు టికెట్ సేల్‌తో పాటు ఇతర విధానాల్లో వచ్చే లాభంలోను వాటా అడుగుతున్నారట.
ప్రస్తుతానికి సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపితే సమస్య పరిష్కారం అవుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ ఆయన చొరవ తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ సంయుక్తంగా ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయబోతున్నాయి? అన్నది వేచి చూడాలి. ఒకవేళ పరిష్కారం ఇవ్వలేకపోతే జూన్ 1 నుంచి సీరియస్ గా థియేటర్లను బంద్ చేయాలని భావిస్తున్నారట. ఎగ్జిబిటర్లు తగ్గేదేలే అంటూ పట్టుబడితే, తొలిగా విడుదలకు వస్తున్న `భైరవం` సినిమా పరిస్థితి ఏమిటన్నది చర్చగా మారింది.