రీల్ కాదు.. రియల్.. నిజ సంఘటనల ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రాలు ఇవే!
సినిమా అంటేనే రంగుల ప్రపంచం, ఊహాజనిత కథలు అనుకుంటాం. కానీ, కొన్ని సినిమాలు మాత్రం కల్పిత కథల కంటే మన జీవితాల నుంచే పుడతాయి.
సినిమా అంటేనే రంగుల ప్రపంచం, ఊహాజనిత కథలు అనుకుంటాం. కానీ, కొన్ని సినిమాలు మాత్రం కల్పిత కథల కంటే మన జీవితాల నుంచే పుడతాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, వీరుల పోరాటాలు, చారిత్రక అంశాలు మనల్ని ఎంతగానో కదిలిస్తాయి. అలాంటి యథార్థ గాథలను వెండితెరపై ఆవిష్కరించి, ప్రేక్షకులను మెప్పించిన కొన్ని అద్భుతమైన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
వెండితెరపై సావిత్రి ప్రయాణం: మహానటి
తెలుగు సినిమా చరిత్రలో సావిత్రి గారి స్థానం ప్రత్యేకం. ఆమె జీవితంలోని అద్భుత విజయాలు, ఆ తర్వాత ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కీర్తి సురేష్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
రాజకీయ సమరయోధుడు: ఎన్టీఆర్ బయోపిక్:
నటుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.టి. రామారావు గారి జీవిత ప్రయాణం ఒక సంచలనం. ఆయన జీవిత కథ ఆధారంగా 'కథానాయకుడు', 'మహానాయకుడు' అనే రెండు భాగాలు వచ్చాయి. ఇక ఒక సామాన్యుడు ప్రజా నాయకుడిగా ఎలా మారాడో ఇందులో చూపించారు.
విద్యార్థి పోరాటం: జార్జ్ రెడ్డి:
ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన వీరుడు, బాక్సర్ జార్జ్ రెడ్డి. 1970ల కాలంలో ఆయన చేసిన సామాజిక పోరాటాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను 'జార్జ్ రెడ్డి' సినిమా ద్వారా నేటి తరానికి పరిచయం చేశారు.
దేశం కోసం ప్రాణత్యాగం: మేజర్:
ముంబై ఉగ్రవాద దాడుల్లో దేశం కోసం వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా 'మేజర్'. అడవి శేష్ నటించిన ఈ చిత్రం ప్రతి భారతీయుడి గుండెను కదిలించింది మరియు దేశభక్తిని పెంపొందించింది.
సముద్ర గర్భంలో యుద్ధం: ది ఘాజీ అటాక్:
ఇక 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన 'పిఎన్ఎస్ ఘాజీ' జలాంతర్గామిని భారత నౌకాదళం ఎలా అడ్డుకుందనే రహస్య యుద్ధం ఆధారంగా 'ది ఘాజీ అటాక్' తెరకెక్కింది. గ్రాఫిక్స్, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ చిత్రం అద్భుతంగా సాగింది.
తొలి తిరుగుబాటు: సైరా నరసింహారెడ్డి:
ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'సైరా' చిత్రం, మన తెలుగు నేలపై జరిగిన వీరోచిత పోరాటాన్ని ఘనంగా చాటిచెప్పింది.
సమాజంలో కుల వివక్ష: లవ్ స్టోరీ:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ' కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. సమాజంలోని కులాంతర వివాహాలు, పరువు హత్యలు, మరియు అణచివేత వంటి యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను ఎంతో సహజంగా తెరకెక్కించారు.
ఊహలకు అందని ఎన్నో సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. అలాంటి వాస్తవాలను, చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో ఈ సినిమాలు విజయవంతమయ్యాయి. అందుకే, కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం, స్ఫూర్తి కోసం ఇలాంటి యథార్థ గాథల సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.