US బాక్సాఫీస్.. వీకెండ్ సినిమాల సంగతేంటి?
ఎప్పటిలానే గత వారం ప్రేక్షకుల ముందుకు కొన్ని సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.;
ఎప్పటిలానే గత వారం ప్రేక్షకుల ముందుకు కొన్ని సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పాన్ ఇండియా లెవెల్ లో.. మరికొన్ని తెలుగులో విడుదలయ్యాయి. అదే సమయంలో నార్త్ అమెరికాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన మూడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. మరి వాటి బాక్సాఫీస్ సంగతేంటి??
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన జాక్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్- తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన జాట్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలు.. గత వారం యూఎస్ లోని థియేటర్స్ లో విడుదల అయ్యాయి.
అయితే సిద్ధు గత మూవీ టిల్లు స్క్వేర్.. యూఎస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ తెలుగు హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీంతో జాక్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సినిమా ఫ్లాప్ గా నిలిచింది. భారీ నష్టాలను తెచ్చిపట్టేలా కనిపిస్తుంది.
డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడిలో కేవలం 20 శాతం వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ పూర్తవ్వాలంటే మిలియన్ డాలర్స్ అవసరం కాగా.. ఇప్పటి వరకు జాక్ మూవీకి $200,000 మాత్రమే వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద జాక్ కు భారీ నష్టాలు రావడం పక్కా అని క్లియర్ గా తెలుస్తోంది.
టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ డెబ్యూ మూవీ జాట్ కూడా జాక్ బాటలోనే వెళ్లింది. పరాజయం పాలైన ఆ సినిమా.. ఇప్పటి వరకు $300,000 రాబట్టింది. స్టోరీలో లోపాల వల్ల మూవీ ఫ్లాప్ గా నిలిచిందని రివ్యూస్ వస్తున్నాయి. క్యాస్టింగ్ కు క్రేజ్ ఉన్నా.. స్టోరీ దెబ్బేసిందని అంతా చెబుతున్నారు.
ఇక అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటి వరకు మిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ వీకెండ్ సినిమాల్లో విన్నర్ గా నిలిచింది గుడ్ బ్యాడ్ అగ్లీ. అయితే యాంకర్ కమ్ నటుడు ప్రదీప్ మాచిరాజు యాక్ట్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కొన్ని కారణాల వల్ల నార్త్ అమెరికాలో రిలీజ్ కాలేదు.