హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్
| ప్రస్తుతం సినిమా విజయానికి స్టార్‌డమ్, భారీ బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇవ్వకపోవడమే పరాజయాలకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కథల ఎంపికపై దృష్టి పెట్టాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువగా నమోదు అవుతోంది. ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు అనే తేడా లేకుండా బాగా లేకుంటే ప్రేక్షకులు తీసి పక్కన పెడుతున్నారు. భారీగా ఖర్చు పెట్టారు కదా ఒకసారి చూద్దాం అనుకున్న వారు లేరు. రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమాలకు రెండు వందల కోట్లు, అంతకు మించి వసూళ్లు నమోదు అవుతున్న కాలం ఇది. బడ్జెట్ తో సంబంధం లేదు, స్టార్‌డం తో అసలు సంబంధం లేదు, స్టార్ దర్శకుడు తీశాడా, పెద్ద నిర్మాత నిర్మించాడా అనే విషయాలను కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. యావరేజ్ గా ఉంటే ఓటీటీలో చూద్దాం అని థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేస్తున్నారు. కనుక ప్రతి హీరో కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చాలా మంది హీరోలకు అర్థం అయింది.
టాలీవుడ్ హీరో వరుస ఫ్లాప్స్...
ఒక తెలుగు హీరోకి మాత్రం ఇంకా ఆ విషయం అర్థం అయినట్లు లేదు. ఆయన పదే పదే ఫ్లాప్‌లు చేస్తూ వస్తున్నాడు. కథ ఎంపిక చేసుకోవడం మొదలుకుని, దానికి సరైన దర్శకుడు, సరైన టెక్నీషియన్స్ ను హీరో ఎంపిక చేసుకుని సినిమా ను చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో క్రేజ్ ఉంది కదా అని ఏ కథను పడితే ఆ కథను చేస్తే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. తన చుట్టూ చేరి భజన చేసే కొందరికి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల కూడా ఆయన సినిమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది కొందరి అభిప్రాయం. ప్రతిభ ఉన్న దర్శకుడికి కాకుండా, పక్కనే ఉంటాడు, తనను నమ్ముకున్నాడు అని దర్శకత్వ బాధ్యతలు ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికి కూడా ఆ హీరో గారికి అర్థం అయినట్లు లేదు. అందుకే మళ్లీ అదే తప్పు చేస్తున్నాడంటూ స్వయంగా ఆయన సన్నిహితులు అంటున్నారు.
హీరోగారికి పర్సనల్ ఇష్యూస్...
ఇక ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పర్సనల్ ఇష్యూస్ ను ఎదుర్కొంటున్నాడు అని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ వ్యవహారాలు సరిగ్గా లేకపోవడంతో పాటు, ఫ్యామిలీ లో కొందరికి అనారోగ్య సమస్యలు, మరికొందరు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ హీరో గారు సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నాడు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే గత కొన్నాళ్లుగా హిట్ లేక డీలా పడ్డాడు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది అయినా కచ్చితంగా మా హీరో సక్సెస్ కొడతాడు, అందరి నోళ్లు మూయిస్తాడు అని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఫ్యాన్స్ కోసం అయినా కాస్త సీరియస్ గా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూనే ఉన్నాడు.
స్టార్‌డంతో వరుస సక్సెస్‌లు...
ఇండస్ట్రీలో వరుస విజయాలు దక్కితే స్టార్‌డం పెరుగుతుంది, అయితే ఒక్క ఫ్లాప్ తో మొత్తం కెరీర్ తలకిందులు అవుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకునే ప్రతి కథను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ హీరో గారు మాత్రం కథల విషయంలో కనీసం ఇతరుల ఒపీనియన్ తీసుకోడని, అసలు కథల ఎంపిక విషయంలో పెద్దగా శ్రద్ద పెట్టడం లేదని అంటున్నారు. గతంలో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఇప్పుడు కూడా అలాంటి కథలతోనే వస్తాను, కామెడీ చేస్తే నవ్వుకుంటారని అనుకుంటున్నాడేమో. అలాంటి సినిమాలకు ఇది సమయం కాదని ఆయన గుర్తించలేక పోతున్నాడు. ముందు ముందు అయినా ఈ హీరో తన తప్పును తెలుసుకుని మంచి కథలను ఎంపిక చేసుకుని, ప్రతిభ ఉన్న దర్శకుడితో సినిమా చేస్తాడని ఆశిద్దాం.