హైద‌రాబాద్‌లో ఖ‌ర్చులు పెరిగాయి.. సినీకార్మికుల‌కు మంత్రి మ‌ద్ధ‌తు!

కార్మికుల మెరుపు స‌మ్మెతో టాలీవుడ్ అయోమ‌యంలో ప‌డింది. ఫెడ‌రేష‌న్ ఆక‌స్మిక దాడితో నిర్మాత‌లు ఖంగు తిన్నారు.;

Update: 2025-08-05 17:32 GMT

కార్మికుల మెరుపు స‌మ్మెతో టాలీవుడ్ అయోమ‌యంలో ప‌డింది. ఫెడ‌రేష‌న్ ఆక‌స్మిక దాడితో నిర్మాత‌లు ఖంగు తిన్నారు. 30శాతం వేత‌న పెంపును త‌క్ష‌ణం అమ‌లు చేస్తేనే సెట్స్ పైకి వ‌స్తామంటూ కార్మికులు భీష్మించుకు కూచున్నారు. ఈ దెబ్బ సెట్స్ పై ఉన్న అన్ని సినిమాల‌కు పెద్ద‌గానే ప‌డింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం షూటింగులు ఆపేసి, ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిలో కొంద‌రు ఉన్న‌ట్టు తెలుస్తోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు లేకుండా పెద్ద‌ సినిమాల‌కు షూటింగులు చేయ‌డం కుద‌ర‌దు. కానీ ఇప్పుడు స‌మ్మె కార‌ణంగా వారంతా అందుబాటులో లేక‌పోవ‌డం ప‌లు పెద్ద హీరోల సినిమాల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.

భేటీలో ఎవ‌రెవ‌రు?

ఇలాంటి స‌న్నివేశంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిర్మాత‌ల‌ స‌మావేశం ప‌రిష్కారం చూపిస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ సాయంత్రం తెలుగు చిత్ర‌సీమ అగ్ర నిర్మాత‌లంతా చిరు ఇంట్లో భేటీ అయ్యారు. మెగాస్టార్ స్వ‌యంగా పూనుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వారంతా కోరారు. సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవిశంకర్, సుప్రియ యార్లగడ్డ త‌దిత‌రులు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి సమస్యపై చర్చించారు. యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ ప్ర‌ముఖులు ముఖ్యంగా ఈ స‌మావేశంలో క‌నిపించారు.

నిర్మాత‌ల భేటీలో చిరు ప్రామిస్:

ఈ ఆక‌స్మిక ప‌రిణామంపై చిరంజీవికి వివ‌రించామ‌ని నిర్మాత సి.క‌ళ్యాణ్ అన్నారు. కార్మికులు ఇలా చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. అయితే వారి వైపు నుంచి స‌మ‌స్య ఏమిట‌న్న‌ది వింటాన‌ని చిరంజీవి అన్నారు.. రెండు మూడు రోజుల్లో స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే తాను జోక్యం చేసుకుంటాన‌ని చిరు ప్రామిస్ చేసిన‌ట్టు సి.క‌ళ్యాణ్‌ తెలిపారు.

దిల్ రాజు నియ‌మించాం:

కార్మికుల ఆక‌స్మిక స‌మ్మెపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా స్పందించారు. ఆయ‌న కార్మికుల క‌ష్ట‌న‌ష్టాల గురించి మాట్లాడారు. హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రంలో జీవ‌న వ్య‌యం పెరుగుతోంద‌ని, కార్మికుల వేత‌నాల‌ను పెంచాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు. దిల్లీ ప‌ర్య‌ట‌న ముగించాక స‌మ‌స్య‌పై చ‌ర్చించేందుకు చొర‌వ తీసుకుంటాన‌ని కోమటిరెడ్డి ప్ర‌క‌టించారు. స‌మ‌స్య మూలాల గురించి తెలుసుకునేందుకు, ప‌రిష్క‌రించేందుకు దిల్ రాజును నియ‌మించామ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ప్ర‌తిదీ క్షుణ్ణంగా చ‌ర్చించాక సామ‌ర‌స్యపూర్వ‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని కూడా కోమ‌టిరెడ్డి సూచించారు.

కొత్త ప్ర‌తిభ‌కు అవ‌కాశాలు..

మ‌రోవైపు టాలీవుడ్ నిర్మాత‌లు కొత్త ప్ర‌తిభ‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక సాంకేతిక నిపుణులు స‌హా క్రాఫ్ట్ లో అంతో ఇంతో అనుభ‌వం ఉన్న‌వారికి వెంట‌నే అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. దీనికి లేబ‌ర్ క‌మీష‌న్ నుంచి అభ్యంత‌రాలేవీ లేవ‌ని, అసోసియేష‌న్ నుంచి మాత్ర‌మే కార్మికుల‌ను తీసుకోవాల‌నే నియ‌మం లేద‌ని ఫిలింఛాంబ‌ర్ అధికారిక నోట్ లో పేర్కొన‌డం షాకిచ్చింది. ఈ వివాదంలో ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారు. కార్మికుల‌తో మాట్లాడిన త‌ర్వాత స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం వెతుకుతాన‌ని ప్రామిస్ చేసారు. మ‌రో రెండు మూడు రోజుల్లో దీనిపై ఏదో ఒక స్ప‌ష్ఠ‌త వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News