టాలీవుడ్ సమస్యలు తీరేదెప్పుడు?
ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో కళకళలాడిన టాలీవుడ్.. ఇప్పుడు మాత్రం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.
ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో కళకళలాడిన టాలీవుడ్.. ఇప్పుడు మాత్రం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలకే మిక్స్డ్ టాక్ వస్తుండటంతో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా సినిమాల పరిస్థితి, థియేటర్ల ఫ్యూచర్, నిర్మాతల నష్టాల గురించి చర్చ జరుగుతోంది.
గతంలో నిర్మాతలు నాన్ థియేట్రికల్ బిజినెస్ తో చాలా వరకు సేఫ్ అయ్యేవారు. ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ లో పెద్ద పార్ట్ తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ సంస్థలు కూడా కంటెంట్ కు మాత్రమే వాల్యూ ఇస్తుండటంతో సాధారణ సినిమాలకు పెద్దగా డబ్బులు రావడం లేదు. దీంతో నిర్మాతలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.
మరోవైపు ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. పెద్ద హీరో ఉన్నాడనే కారణంతో మాత్రమే థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. కథ స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే ఓటీటీలో చూసేద్దామని ఆలోచనతో వేచి చూస్తున్నారు. ఇంకేముంది థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలనే డిమాండ్ కూడా ఇదే సమస్యల కారణంగా ముందుకు వచ్చింది. రెంటల్ విధానంలో సినిమాలు ప్రదర్శిస్తే నష్టాలు వస్తున్నాయని.. షేర్ ఆధారంగా సినిమాలు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా పెంచమని తేల్చి చెబుతున్నారు.
ఇక దర్శకుల పరిస్థితి కూడా అంతే. కొత్త కథలు రాసినా ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతోంది. సోషల్ మీడియా ప్రభావం, పాన్ ఇండియా అంచనాలు, ఇతర భాషల సినిమాల పోటీ కారణంగా ప్రేక్షకుల అభిరుచి వేగంగా మారుతోంది. దీంతో దర్శకులు ఒత్తిడిలో పని చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ మళ్లీ గాడిలో పడాలంటే అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా కంటెంట్ విషయంలో శ్రద్ధ అవసరం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది చివరికి మంచి సినిమానే అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది.
అలాగే సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం కూడా ఇప్పుడు అత్యవసరంగా మారింది. భారీ రెమ్యూనరేషన్లు, అవసరానికి మించి పెరిగిన ప్రొడక్షన్ ఖర్చులు నిర్మాతలపై భారం పెడుతున్నాయి. అందుకే హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు పరిస్థితిని అర్థం చేసుకుని పారితోషికాల విషయంలో కొంత తగ్గితే నిర్మాతలకు ఊరట లభించే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్లు కూడా నాన్ థియేట్రికల్ ఆదాయాలపై మాత్రమే ఆధారపడకుండా థియేట్రికల్ బిజినెస్ కోసం ఆలోచించాల్సి ఉంది. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఇచ్చే సినిమాలు వస్తే థియేటర్లకు మళ్ళీ పాత రోజులు వస్తాయి. మొత్తంగా టాలీవుడ్ సమస్యలకు ఒక్కరే పరిష్కారం కాదు.. ఇండస్ట్రీ మొత్తం కలిసి ముందుకు వస్తేనే పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.