సినిమా రిలీజ్.. మళ్లీ నమ్మే రోజులు రావాలంటే..

ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారంటే.. దాదాపు అదే తేదీన సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నమ్మేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

Update: 2026-10-06 09:53 GMT

ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారంటే.. దాదాపు అదే తేదీన సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నమ్మేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెద్ద సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా.. ఆ తేదీ నిజంగా ఉంటుందా అనే అనుమానం మొదలవుతోంది. ఎందుకంటే వరుసగా సినిమాల రిలీజ్ తేదీలు మారుతుండటమే దీనికి మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది.

సినిమా రిలీజ్ అనేది ఒక్క నిర్మాతకు సంబంధించిన విషయం కాదు. ఒక సినిమా కోసం థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్.. ఇలా చాలా వ్యవహారాలు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద సినిమా ఒక తేదీని ప్రకటిస్తే.. దాన్ని నమ్ముకుని ఇతర సినిమాలు కూడా తమ రిలీజ్ తేదీలను నిర్ణయించుకుంటాయి. కానీ చివరి సమయంలో ఆ సినిమా వాయిదా పడితే.. దాని ఎఫెక్ట్ మిగతా సినిమాలపై కూడా పడుతుంది.

నిజానికి సినిమా వాయిదా పడటం కొత్త విషయం కాదు. షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కావడం, అనుకోని పరిస్థితులు ఎదురవడం వంటి కారణాలతో సినిమాలు వాయిదా పడొచ్చు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మూవీ వర్క్స్ ఇంకా పూర్తి కావడానికి చాలా సమయం ఉన్నప్పుడే.. ఒక తేదీని ఫిక్స్ చేసి భారీగా ప్రకటించడం వల్లే అసలు సమస్య మొదలవుతోంది.

రిలీజ్ డేట్ అనేది కేవలం పోస్టర్‌ పై వేసే తేదీగా కాకుండా.. నిర్మాత ఇచ్చే ఒక మాటగా ఉండాలి. ఒకసారి తేదీ ప్రకటించిన తర్వాత దాన్ని మార్చాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే అన్ని పనులను అంచనా వేసుకోవాలి. సినిమా ఎంత వరకు పూర్తవుతుంది.. పోస్ట్ ప్రొడక్షన్‌ కు ఎంత సమయం పడుతుంది.. ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి.. థియేటర్లు ఎలా దొరుకుతాయి.. అనే విషయాలపై ప్లాన్ ఉండాలి.

ముఖ్యంగా పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో రిలీజ్ డేట్ మారితే ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్న చిన్న, మీడియం సినిమాలు తమ ప్లాన్లు మార్చుకోవాల్సి వస్తుంది. థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు రావచ్చు. డిస్ట్రిబ్యూటర్లు తమ లెక్కలను మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు కూడా రిలీజ్ డేట్ విషయంలో అంత త్వరగా నమ్మే పరిస్థితిలో లేరు.

అఫీషియల్ డేట్ ప్రకటించినా.. సినిమా నిజంగా అదే రోజున వస్తుందా అనే చర్చ మొదలవుతోంది. ఒకసారి కాదు.. పదేపదే తేదీలు మారితే నమ్మకం మరింత తగ్గే అవకాశం ఉంటుంది. రిలీజ్ డేట్ అంటే ఒకప్పుడు నమ్మకానికి గుర్తుగా ఉండేది. మళ్లీ అదే పరిస్థితి రావాలంటే మేకర్స్ తమ ప్లానింగ్‌ ను మార్చుకోవాలి. ఒక తేదీ ప్రకటిస్తే.. ఆ తేదీపై ప్రేక్షకులు, ఇండస్ట్రీ నమ్మకం పెట్టుకునేలా వ్యవహరించాలి. లేకపోతే రాను రాను రిలీజ్ డేట్ ప్రకటించినా.. అది నిజమైన తేదీనా, మరోసారి మారే తేదీనా అనే డౌట్ మిగిలిపోతుంది.

Tags:    

Similar News