నరకడం మీదనే ఫోకస్ చేస్తున్న దర్శకులు... ఎందుకిలా?

ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే సినిమా అంతిమ లక్ష్యం...దానికోసం ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్ లో మూవీస్ చేస్తున్నారు.

Update: 2026-10-06 09:40 GMT

ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే సినిమా అంతిమ లక్ష్యం...దానికోసం ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్ లో మూవీస్ చేస్తున్నారు. వైవిధ్య భరితమైన సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్స్ మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు. ఎవరైతే డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ హృదయాలకు హత్తుకునే సినిమా తీస్తారో వాళ్ళే టాప్ డైరెక్టర్లుగా ఎదుగుతారు. ఈ మధ్య కాలం లో కొంతమంది దర్శకులు తమ సినిమాల్లో మనుషులను నరకడమే పని గా పెట్టుకొని మూవీస్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ముందు యాక్షన్ సీన్స్ రాసుకున్న తర్వాత స్టోరీ రాసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అందుకే కొన్ని సీన్స్ లో ఎమోషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదు. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. ఇంకొద్ది రోజులు ఇలాంటి సినిమాలే తీస్తే ప్రేక్షకుడు ఫ్యామిలీతో పాటు థియేటర్ కి రావడానికి భయపడిపోతాడు. రోజు రోజుకి వైలెన్స్ శృతి మించిపోతుంది. వాటన్నింటికి చెక్ పెడుతూ డీసెంట్ సబ్జెక్ట్ లతో సినిమాలు రావాలి. ఎంటర్ టైన్ మెంట్ అంటే నరకడం ఒకటే కాదు. నవరసాలను పలికిస్తూ ప్రేక్షకుడిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మూడు గంటల పాటు ఎంటర్ టైన్ చేయాలి. అలాంటి మూవీస్ వస్తేనే మళ్ళీ సినిమాలను చూడాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ మంది ప్రేక్షకులకు కలుగుతుంది.

ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి...

సినిమా అంటే థియేటర్ లో చూసి వదిలేసేలా ఉండకూడదు. అందులో చూపించే ఒక మెసేజ్ ప్రేక్షకుడి మైండ్ సెట్ ను మార్చేలా ఉండాలి. ఎమోషన్ సన్నివేశాలు గుర్తుచేసుకున్న ప్రతి సారి హృదయం ద్రవించేలా ఉండాలి. కొన్ని రోజుల పాటు ఆ మూవీ ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో అలాగే ఉండిపోవాలి. అలాంటి మూవీస్ మాత్రమే ఆడియన్స్ ను రిపిటెడ్ గా థియేటర్ కి రప్పిస్తాయి. మన మేకర్స్ గతంలో గొప్ప సబ్జెక్టులతో సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించడానికి మనుషుల తలకాయలు పొట్టేళ్ల లా నరకడం హీరోయిజానికి ప్రతీక గా భావిస్తున్నారు. విలన్స్ తో ఫైట్స్ ఉండాలి కానీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బంది పడేలా ఉండకూడదు.

తలకాయలు నరకడమే హీరోయిజమా?

ఇప్పటికే మన డైరెక్టర్స్ కొందరు తెలుగు ఇండస్ట్రీ ని ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మార్చేశారు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్స్ మన సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో ఇంకొంత మంది డైరెక్టర్స్ మాత్రం 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు' పక్క భాషల వాళ్లు నలుగురి తలకాయలు నరికారు మనం ఐదుగురి తలలు నరకాలి అనే కాన్సెప్ట్ ను మైండ్ లో పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు అవన్నీ వర్కౌట్ అవ్వవు. హీరోయిజం అంటే తలలు నరకడం ఒక్కటే కాదు. తప్పు చేసినవారికి బుద్ధి చెప్పడం హీరోయిజం, మన అనుకున్న వాళ్ళను కాపాడుకోవడం కూడా హీరోయిజమే...

అందుకే విజువల్ గా సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేయండి. పొయిటిక్ గా సినిమాను చెప్పే ప్రయత్నం చేయండి. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయండి. కథలో వైవిధ్యాన్ని చూపించండి. ఒకప్పటి జన్యూన్ కామెడీని తీసుకురండి. ప్రేక్షకుడి ఇష్టాలను తెలుసుకొని వాళ్ళకి నచ్చే సినిమాలను తీయండి. జనరేషన్ లో వచ్చే మార్పులను గమనించండి. క్యారెక్టరైజేషన్స్ ను గొప్ప గా డిజైన్ చేయండి... మొత్తానికైతే పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి మరింత పెంచేలా సినిమాలు తీయండి...

Tags:    

Similar News