తెలుగు సినిమా బడ్జెట్ @1000 కోట్లు
తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని చెప్పుకోవాల్సిందే.;
తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ తరువాతే తెలుగు సినిమా సత్తా, మార్కెట్ ఏంటనేది యావత్ ప్రపంచానికి తెలిసింది. అంత వరకు ఎంతో మంది స్టార్లు సినిమాలు చేసినా `బాహుబలి` తరువాతే తెలుగు సినిమా బడ్జెట్, మార్కెట్ పరిధి పెరిగాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
అంతకు ముందు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే రూ.20 కోట్ల వరకు ఖర్చు పెట్టేవారు. కానీ `బాహుబలి`కి ఊహించని స్థాయిలో ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. `బాహుబలి ది బిగినింగ్`కి రూ.180 కోట్లు ఖర్చు చేయగా, బాహుబలి పార్ట్ 2కు ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలవడం తెలిసిందే.
దీని తరువాత టాలీవుడ్ సినిమా మార్కెట్ స్థాయి మారిపోయింది. బడ్జెట్ కూడా భారీ స్థాయికి చేరడం మొదలైంది. అంతకు ముందు 20, 30 కోట్లు మాత్రమే పెట్టడానికి ముందుకొచ్చే నిర్మాతలు `బాహుబలి` తరువాత నుంచి వంద కోట్ల వరకు అయినా బడ్జెట్ కేటాయించడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. మార్కెట్ పరిధి పెరగడం, రిటర్న్స్ కూడా భారీగా ఉండటంతో ఇప్పుడు వంద కోట్లు అంటే ఏ నిర్మాతా భయపడటం లేదు.
బాహుబలి తరువాత వచ్చిన `RRR` , పుష్ప, పుష్ప 2 సినిమాలకు వందల కోట్లు బడ్జెట్‌లు కేటాయించడం, భారీ లాభాలు రావడంతో ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ వంద కోట్లంటే లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు RRR, పుష్ప 2 తరువాత తెలుగు సినిమా బడ్జెట్ తారా స్థాయికి చేరింది. దీనికి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, నిర్మాణానికి రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లే ఉదాహరణగా చెప్పొచ్చు. మహష్ - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్ పాన్ వరల్డ్ మూవీ కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే తరహాలో స్టార్ హీరో ప్రభాస్‌తో హను రాఘవపూడి రూపొందిస్తున్న రొమాంటిక్ వార్ డ్రామా `ఫౌజీ`కి రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక `పుష్ప 2` సంచలన విజయం తరువాత బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో సరికొత్త నేపథ్యంలో సూపర్ హీరో కథగా రూపొందనున్న ఈ మూవీ కోసం సన్ పిక్చర్స్ వారు రూ.600 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి రెడీ అవుతున్నారని ప్రచారం మొదలవడంతో ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ హాట్ టాపిక్‌గా మారింది.