టికెట్ రేట్లపై కొత్త జీవో.. గిల్డ్ చెప్పిందేమిటంటే..
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమా టికెట్ విధానంపై యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమా టికెట్ విధానంపై యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పందించింది. ఈ జీవోలో పెద్ద సినిమాల టికెట్ రేట్లు, నాన్ ప్రీమియం సీట్లు, రోజుకు ఐదు షోలు, సినీ కార్మికుల కోసం ప్రత్యేక నిధి వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకోవడం ప్రతి సినిమాకు వర్తించదని క్లియర్ చేసింది.
అర్హత ఉన్న పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే అదనపు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని గిల్డ్ తెలిపింది. ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్‌డీఆర్ లాంటి టెక్నాలజీతో వచ్చే సినిమాలకు ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అలాంటి సినిమాల దరఖాస్తులను అధికారులు పరిశీలించిన తర్వాతే రేట్ల పెంపుకు అనుమతి వస్తుందని వివరించింది. అంటే సినిమా పెద్దది అని చెప్పి నేరుగా రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 25 శాతం నాన్ ప్రీమియం సీట్లు. ఏసీ, నాన్ ఏసీ, స్పెషల్ థియేటర్, మల్టీప్లెక్స్.. ఏ కేటగిరీ అయినా మొత్తం సీట్లలో 25 శాతం తక్కువ ధర కేటగిరీలో ఉంచాల్సి ఉంటుందని గిల్డ్ తెలిపింది. ప్రేక్షకులకు అన్ని సీట్లు ఎక్కువ రేట్లలోనే ఉండకుండా ఈ రూల్ ఉపయోగపడుతుందని వివరించింది.
రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం కూడా కొత్త విధానంలో ఉంది. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి కొన్ని రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఐదు షోలు ఉంటే ఆ రద్దీ త్వరగా తగ్గుతుందని గిల్డ్ తెలిపింది. తర్వాత చిన్న, మధ్య తరహా సినిమాలకు కూడా స్క్రీన్లు దొరికే అవకాశం పెరుగుతుందని పేర్కొంది. ఇక సినీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేసే అంశం కూడా ఈ విధానంలో ఉందని గిల్డ్ తెలిపింది. సినిమా పరిశ్రమలో పని చేసే కార్మికులకు ఉపయోగపడేలా ఈ నిధి ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు వివరించింది.
టికెట్ రేట్లతో పాటు కార్మికుల విషయం కూడా ఇందులో ఉండటం గమనించాల్సిన పాయింట్‌గా పేర్కొంది. ఇక కొత్త జీవోను కేవలం టికెట్ ధరల పెంపు కోణంలో మాత్రమే చూడొద్దని గిల్డ్ తెలిపింది. అన్ని రకాలుగా కలిపిన ఒక మంచి విధానమని వివరించింది. కొత్త టెక్నాలజీ, పెద్ద పెట్టుబడులు, చిన్న సినిమాలు, కార్మికులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ జీవో వచ్చిందని గిల్డ్ చెప్పింది.