లెజెండరీ నటి షావుకారు జానకి కన్నుమూత.. సినీ లోకంలో విషాదం

భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ దిగ్గజ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) ఇకలేరు.

Update: 2026-08-21 11:22 GMT

భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ దిగ్గజ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) ఇకలేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆమె, ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు. నటి మృతి చెందిన విషయాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

మొదటి సినిమాతోనే 'షావుకారు'గా గుర్తింపు:

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించిన జానకి గారు, చిన్నతనంలోనే ఆకాశవాణి రేడియో జాకీగా పనిచేసేవారు. ఆ తర్వాత 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ మొదటి సినిమా పేరుతోనే ఆమె పరిశ్రమలో నిలబడిపోయి అందరికీ ‘షావుకారు జానకి’గా మారిపోయారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు.

పాన్ ఇండియా రేంజ్ దాటిన ప్రయాణం:

కన్నడ ఇండస్ట్రీలోకి ‘దేవకన్నిక’ సినిమాతో అడుగుపెట్టిన ఆమె, డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ‘మహిషాసుర మర్దిని’ చిత్రంలో నటించారు. ఇది ఆ రోజుల్లోనే తొలి కన్నడ పాన్-ఇండియా చిత్రంగా నిలిచింది. తన చెల్లెలు కృష్ణకుమారి, మనవరాలు వైష్ణవితో కలిసి సినీ వారసత్వాన్ని కొనసాగించారు. ఇక వెండితెరపైనే కాకుండా ‘ఊరరింద రహస్యం’ వంటి సీరియల్స్‌ ద్వారా బుల్లితెరపై కూడా నటించి అలరించారు.

చివరి సినిమాలు.. పద్మశ్రీ పురస్కారం:

ఇటీవలి కాలం వరకు నటనా రంగానికి దూరంగా ఉండకుండా యాక్టివ్‌గా ఉన్నారు. 2020లో తమిళంలో ‘బిస్కోత్’, 2023లో తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అన్ని మంచి శకునములే’ చిత్రంలో చివరిగా కనిపించారు. చిత్రసీమకు చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.

సినీ ప్రముఖుల సంతాపం:

ఆమె మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు తెలుపుతున్నారు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు ..సినీ రంగంలో గొప్ప పేరు సంపాదించిన షావుకారు జానకి గారి మరణవార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె నటించిన పాత్రలు ఎప్పటికీ మనసుల్లో నిలుస్తాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా సానుభూతి అంటూ పోస్ట్ చేసారు..

తన అద్భుతమైన నటన, శైలితో ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసుపత్రిలో విజిట్ చేసిన నడిగర్ సంఘం సభ్యులు నాజర్, సౌందరరాజా తదితరులు ఆమె నివాళికి ఏర్పాట్లు చేశారు. శతాబ్దపు నటిగా నిలిచిన ఆమె జ్ఞాపకాలు, సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.

Tags:    

Similar News