మహేష్- సందీప్ వంగా ప్రాజెక్ట్ సస్పెన్స్‌కి తెర దించిన‌ట్టేనా?

మరోవైపు ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ `స్పిరిట్` కాస్టింగ్ .. విలన్ ఎంపికపై కూడా సోషల్ మీడియా వేదికగా రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

Update: 2026-08-21 09:57 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో సినిమా తెర‌కెక్క‌నుందంటూ గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై వస్తున్న రూమర్లకు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తాజా ఇంట‌ర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ప్ర‌స్తుతానికి వీరిద్దరి మధ్య కథా చర్చలు ఏవీ జ‌ర‌గ‌లేదు.. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఖరారు కాలేదని స్పష్టత‌నిచ్చారు. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కినా అది `యానిమల్ పార్క్` చిత్రం పూర్తయిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వంగా బ్రదర్స్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ నిజానికి మ‌హేష్ తో సినిమా ఖ‌రారైంద‌నే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అయితే దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని ప్రణయ్ రెడ్డి బయటపెట్టారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు మహేష్ తండ్రిగారైన ఘట్టమనేని కృష్ణగారి పాత సినిమా వీడియో ఒకటి కనిపించిందని.. సందీప్ తండ్రికి కూడా ఆ సినిమా ఎంతో ఇష్టం కావడంతో దాన్ని అభిమానంతో మహేష్‌కి పంపి శుభాకాంక్షలు తెలిపారని వివరించారు. కేవలం ఒక పుట్టినరోజు శుభాకాంక్షల వీడియో వైరల్ అయినంత మాత్రాన ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని అనుకోవడం క‌రెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ `స్పిరిట్` కాస్టింగ్ .. విలన్ ఎంపికపై కూడా సోషల్ మీడియా వేదికగా రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించడం లేదని ప్రణయ్ రెడ్డి అధికారికంగా ఖరారు చేశారు. అదే సమయంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వెనుక ఆయ‌న‌ రాజకీయాభిప్రాయాలు, వివాదాస్పద వ్యాఖ్యలే కారణమంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

సామాజిక మాధ్యమాల్లో ప్ర‌చారం ప్రకారం ప్రకాష్ రాజ్ తన రాజకీయ వ్యాఖ్యలను సినిమా పూర్తయ్యే వరకు పక్కన పెట్టాలని సందీప్ వంగా కోరారని.. దానికి ఆయన ఒప్పుకోకపోవడం వల్లే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారని కథనాలు అల్లేసారు. అయితే ఈ పుకార్లను నిర్మాత ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా తీవ్రంగా ఖండించారు. ప్రకాష్ రాజ్ కాంబినేషన్ - వాయిస్ ఓవర్ ఆలోచన కేవలం ప్రారంభ స్క్రిప్ట్ - టీజర్ స్థాయిలోనే అనుకున్నామని.. కానీ కథా గమనంలో ఆ క్యారెక్టర్ సరిగ్గా సెట్ కాకపోవడం వల్లే ఆయనను రీప్లేస్ చేసామ‌ని తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత విభేదాలు లేవని ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా క్లియ‌ర్ క‌ట్ గా తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో స్పిరిట్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. డెడ్ లైన్ ప్ర‌కారం విడుద‌ల చేసేందుకు సందీప్ వంగా త‌న వంత కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

సినిమా ప్రమోషన్ల విషయంలో తమకు ఎలాంటి పెయిడ్ పిఆర్ వ్యవస్థ లేదని.. కేవలం ఆర్గానిక్ కంటెంట్‌నే నమ్ముకుంటామని ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేయడం గమనార్హం. పాత్రల ఎంపిక అనేది కేవలం కథా అవసరాలకు మాత్రమే కట్టుబడి ఉంటుందని.. అనవసర ప్రచారాలు .. ఊహాగానాలను ప్రేక్షకులు నమ్మవద్దని ఆయన విశ్లేషించారు. వంగా బ్రదర్స్ తమ ప్రతి నిర్ణయంలోనూ కథకే ప్రథమ పీఠం వేస్తూ..పరిశ్రమలో సరికొత్త పారదర్శకమైన విధానాన్ని పాటిస్తున్నారని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Tags:    

Similar News