నైతిక విలువల కోసం కోట్లు వదులుకున్న స్టార్లు
గ్లామర్ ప్రపంచంలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్- విపరీతమైన క్రేజ్ లభిస్తున్నా సమాజం విషయంలో బాధ్యతను, నైతిక విలువలను ప్రధానంగా భావించే స్టార్లు చిత్ర పరిశ్రమలో కొందరే ఉంటారు.
గ్లామర్ ప్రపంచంలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్- విపరీతమైన క్రేజ్ లభిస్తున్నా సమాజం విషయంలో బాధ్యతను, నైతిక విలువలను ప్రధానంగా భావించే స్టార్లు చిత్ర పరిశ్రమలో కొందరే ఉంటారు. కేవలం డబ్బు లేదా పబ్లిసిటీ కోసం కాకుండా తమ నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆలోచించి కొన్ని అవకాశాలను, ప్రకటనలను తిరస్కరించిన దాఖలాలు మన భారతీయ సినిమా రంగంలో ఎన్నో ఉన్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వ్యాపార ప్రకటనల ఆఫర్లను.. కొన్ని రకాల పాత్రలను నిరాకరించారు. ముఖ్యంగా మద్యపానం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేసే అవకాశాలు కోట్లలో వచ్చినా ఆయన ఏనాడూ ఒప్పుకోలేదు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సిద్ధాంతాలకు కట్టుబడి కొన్ని ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారీ ఆఫర్ వచ్చినా ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రచారం చేయనని తెగేసి చెప్పారు.
అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే మద్యం, గుట్కా వంటి బ్రాండ్‌లను ప్రచారం చేసే ఆఫర్లను నైతిక విలువల కోసమే తిరస్కరించారు. తాజాగా వర్ధమాన నటుడు సిద్ధార్థ్ కూడా తన సినీ ప్రయాణంలో ప్రత్యేక గీతాలకు (ఐటమ్ సాంగ్స్) ఎందుకు దూరంగా ఉంటున్నారో స్పష్టం చేశారు. ఒక మహిళను పదుల సంఖ్యలో పురుషులు చుట్టుముట్టి అనుచితంగా ప్రవర్తించే ఐటమ్ పాటల్లో నటించడం తనకు నచ్చదని.. సమాజానికి చెడు సందేశం ఇచ్చే కంటెంట్‌కు తాను దూరంగా ఉంటానని వెల్లడించారు.
కేవలం వీరు మాత్రమే కాకుండా.. సౌత్ నుండి నార్త్ వరకు మరికొందరు స్టార్లు కూడా ఇదే బాటలో నడిచారు. బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ మనీ-మేకింగ్ ప్రకటనలకు దూరంగా ఉంటూ కేవలం సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమాలకే ప్రాధాన్యతనిచ్చారు. అల్లు అర్జున్ కూడా `పుష్ప` విజయం తర్వాత రూ.కోట్లాది రూపాయల విలువైన పొగాకు బ్రాండ్ ప్రకటనను నైతిక కారణాల రీత్యా తిరస్కరించారని కథనాలొచ్చాయి. సైమన్, సాయి పల్లవి వంటి నటీమణులు కూడా ఫెయిర్‌నెస్ (చర్మం తెల్లగా చేసే) క్రీమ్‌ల ప్రకటనలను నిరాకరించి తమ నైతికతను చాటుకున్నారు.
సినిమాలు - పాత్రల ఎంపికలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తాము సమాజంలో చూపే ప్రభావం విషయంలో కూడా అంతే బాధ్యత వహించాలని ఈ స్టార్లు నిరూపిస్తున్నారు. స్టార్ ఇమేజ్ కంటే సామాజిక బాధ్యత, వ్యక్తిగత విలువలకే ప్రథమ పీఠం వేస్తూ ఈ నటులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
అయితే ఇటీవలి కాలంలో పాన్ మసాలాలు, గుట్కాల ప్రకటనల్లో కనిపించిన షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి పెద్ద స్టార్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, సదరు స్టార్లు తప్పును అంగీకరించకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతిని మరువలేం. ఏదైనా ఉత్పత్తి ప్రజలకు హాని కలిగిస్తే దానిని పండించకూడదు... లేదా మార్కెటింగ్ కి ప్రభుత్వాలు అనుమతించకూడదు. ఆదాయం కోసం ప్రభుత్వాలు అనుమతించగా, తాము ప్రకటనలో నటిస్తే తప్పేంటి? అని షారూఖ్ నిలదీసే ప్రయత్నం చేసారు. అయితే అందుకు భిన్నంగా నైతిక విలువల కోసం కోలాల ప్రకటనలు, ఐటమ్ పాటల్లో నర్తించే అవకాశాల్ని కూడా కొందరు హీరోలు వదులుకోవడం ఆసక్తికరం.