సర్టిఫికేషన్ తర్వాత సెన్సార్ బోర్డులో మార్పులకు చెక్!
రూల్ 33 పుస్తకాల్లో అలాగే ఉన్నా? ఆచరణలో దానిని ఉపయోగించుకునే వెసులుబాటును తొలగించడంతో దర్శక-నిర్మాతలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.
సినిమా రంగంలో ప్రొడ్యూసర్లు -దర్శకులు ఎదుర్కొనే సవాళ్లకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించిన తర్వాత రన్‌టైమ్‌లో మార్పులు చేయడం, సన్నివేశాలను తొలగించడం లేదా కొత్తగా జోడించడం వంటి వెసులుబాట్లను పూర్తిగా తొలగిస్తూ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. కొత్తగా మార్పుల ప్రకారం సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్‌లోని రూల్ 33 అమలు తీరులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
గతంలో ఉన్న వెసులుబాటు ప్రకారం నిర్మాతలు తమ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా బోర్డుకు సమాచారం అందించి రన్‌టైమ్‌ను తగ్గించడం లేదా అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఆగస్టు 10 నుండి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ఆ సౌలభ్యం ఇకపై ఉండదని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇకపై మేకర్స్ సెన్సార్ బోర్డు పరిశీలనకు పంపే వెర్షనే తుది వెర్షన్‌గా పరిగణించబడుతుంది. సినిమా నిడివి ఎక్కువగా ఉందని భావించి సెన్సార్ పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో కొన్ని నిమిషాలు ట్రిమ్ చేద్దామన్నా ? సబ్‌టైటిల్స్ వంటి అంశాలను తర్వాత జోడిద్దామన్నా ఆప్షన్ ఉండదని తెలుస్తోంది.
రూల్ 33 పుస్తకాల్లో అలాగే ఉన్నా? ఆచరణలో దానిని ఉపయోగించుకునే వెసులుబాటును తొలగించడంతో దర్శక-నిర్మాతలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. సెన్సార్‌కోసం దరఖాస్తు చేసే ముందే సినిమాను అన్ని విధాలుగా పక్కాగా లాక్ చేసి పూర్తి ఫైనల్ కట్‌ను మాత్రమే బోర్డు ముందుకు తీసుకెళ్లాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. సర్టిఫికేషన్ పొందిన తర్వాత సినిమాలో ఎలాంటి మార్పులు చేసినా అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల నిర్మాతలు పోస్ట్-ప్రొడక్షన్ దశలోనే సినిమాల రన్‌టైమ్ - ఇతర కంటెంట్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తంగా చూస్తే సీబీఎఫ్‌సి తీసుకున్న కఠినమైన నిర్ణయం చిత్ర నిర్మాణ శైలిలో పెద్ద మార్పు అనే చెప్పాలి. చివరి నిమిషంలో చేసే మార్పులకు తెరపడటంతో దర్శకులు కంటెం ట్‌ను మరింత స్పష్టతతో ..కచ్చితత్వంతో ముందుగానే సిద్ధం చేసుకుని సెన్సార్‌కు సమర్పించడం తప్పనిసరి అయింది.