'ఇరుముడి' మూవీ రివ్యూ

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు.

Update: 2026-08-21 06:26 GMT

నటీనటులు: రవితేజ- ప్రియ భవానీ శంకర్- బేబి నక్షత్ర- సాయికుమార్- స్వశిక- రమేష్ ఇందిర- అజయ్ ఘోష్- రమణ భార్గవ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: విష్ణు శర్మ

నిర్మాతలు: నవీన్ ఎర్నేని- యలమంచిలి రవిశంకర్

రచన-దర్శకత్వం: శివ నిర్వాణ

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. మరి ఈ చిత్రమైనా రవితేజ నిరీక్షణకు తెరదించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ: త్రినాథ్ గోదావరి ప్రాంతంలో ఒక మధ్య తరగతి వ్యక్తి. ఆటో నడుపుకుంటూ.. తన పొలంలో అరటి తోటల పంట చేసుకుంటూ బతికే అతడికి తన కూతురు మణికంఠ (బేబి నక్షత్ర) అంటే ప్రాణం. అలాగే ఊరిలో ఉండే ఆడపిల్లలందరినీ కూడా తన కూతుళ్లలాగే చూస్తాడు. ఐతే అతడికి మందు కొట్టే బలహీనత ఉంటుంది. ఏడాదంతా మద్యం మత్తులో మునిగి తేలే త్రినాథ్.. 41 రోజులు మాత్రం అయ్యప్ప మాలలో ఉంటూ ఈ అలవాటుకు దూరంగా ఉంటాడు. ఊరిలో ఆడపిల్లల జోలికి వచ్చే ఆకతాయిల మీద చేయి చేసుకునే క్రమంలో త్రినాథ్ కు శత్రువులు పెరుగుతారు. దీనికి తోడు ఈసారి త్రినాథ్ మ ాల వేసుకునే ముందు.. తర్వాత ఊరిలో కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతాయి. అవేంటి.. వాటి వల్ల త్రినాథ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. ఆ పరిణామాల వెనుక ఉన్నది ఎవరు.. వారిని త్రినాథ్ కనిపెట్టి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒక పదేళ్లు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే.. ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయ్యప్ప భక్తుడిగా కనిపించడం.. ఆ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టడం ఊహకందని విషయాలే. వర్తమానంలోకి వచ్చి ఆలోచించినా.. ఇది ఆశ్చర్యకరమే. మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ఇలాంటి సినిమాకు ఒప్పుకోవడం.. ఆయన్ని పెట్టి శివ నిర్వాణ ఈ సినిమా తీయాలనుకోవడం షాకింగే. ఐతే ఇవన్నీ సినిమా చూడ్డానికి ముందు తగిలిన షాకులు. థియేటర్లో అడుగుపెట్టాక ఇంకా పెద్ద షాకులుంటాయి. మన ఆడియన్స్ తెర మీద చూడ్డానికి అంతా ఇష్టపడని లైంగిక వేధింపుల అంశం చుట్టూ కథను నడపడం.. ప్రేక్షకులు షేక్ అయిపోయే ట్విస్టు ఇవ్వడం.. ఇలా ‘ఇరుముడి’లో సగటు తెలుగు ప్రేక్షకులు ‘జీర్ణించుకోలేని’ విషయాలు చాలానే ఉన్నాయి. ఐతే ‘ఇలా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు’ అనే స్టాక్ డైలాగును దాటి ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే. కానీ నిజాయితీగా ఒక కథను చెబితే.. ఒక కన్విక్షన్ తో సినిమా తీస్తే.. అది కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని.. ఆడియన్స్ కూడా మనసారా దాన్ని స్వీకరిస్తారని చెప్పడానికి ‘ఇరుముడి’ ఉదాహరణగా నిలుస్తుంది. భక్తి.. థ్రిల్.. ఫ్యామిలీ ఎమోషన్లు.. సెంటిమెంట్.. డ్రామా.. మెసేజ్.. ఇలా అనేక అంశాలు సరిగ్గా పండిన ప్రత్యేకమైన చిత్రం.. ఇరుముడి.

ప్రయోగం చేయడం కంటే.. ఆ ప్రయోగంతో మెప్పించడం గొప్ప విషయం. ‘ఇరుముడి’ ఆ కోవకే చెందుతుంది. రవితేజ లాంటి మాస్ హీరో అయ్యప్ప భక్తుడి అవతారం ఎత్తడం.. సినిమా అంతా లుంగీలో చాలా మామూలుగా కనిపించడం.. సెంటిమెంటు పండించడం.. ఆఖర్లో ఆయన్ని చూసే ప్రేక్షకులకు అప్రయత్నంగా కళ్లలో నీళ్లు వచ్చేయడం.. ‘ఇరుముడి’ని అత్యంత ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ట్రైలర్ చూసినపుడే తండ్రీ కూతళ్ళ బంధాన్ని చాలా గాఢంగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ విషయంలో ఒక అంచనాతో వచ్చినా.. ఆ ఎమోషన్ అంచనాలను మించే స్థాయిలో ఉంటుంది. సెంటిమెంట్ సినిమాల్లో మాదిరి విపరీతమైన నాటకీయత లేకుండా జెన్యూన్ ఎమోషన్లతో ఆ బంధాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను కదిలించేస్తుంది. తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ముచ్చటగొలిపేలా ఉండడమే కాదు.. ఒక దశ దాటాక గుండెల్ని పిండేస్తాయి కూడా. ముఖ్యంగా పతాక సన్నివేశాలను చూసి కదిలిపోని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తండ్రి-కూతురు పాత్రలను శివ నిర్వాణ అంత గొప్పగా తీర్చిదిద్ది ఆ ఎమోషన్ ను ప్రేక్షకుల్లో అంత బలంగా ఎక్కించాడు.

తెర మీద పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు ఎంత బాగా ఫీలయ్యారంటే.. ఆ కథ వారికి అంతగా కనెక్ట్ అయినట్లు. ‘ఇరుముడి’లో చివరి అరగంటలో ప్రేక్షకుల భావోద్వేగాలు అలాగే పతాక స్థాయికి వెళ్తాయి. హీరో పాత్ర తాలూకు బాధను.. కసిని ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఫీలవుతారు. తెరపై జరిగే పరిణామాలకు అంతగా స్పందిస్తారు. అక్కడి దాకా ఒక మోస్తరుగా అనిపించే ‘ఇరుముడి’.. చివరి అరగంటలో మాత్రం ‘స్పెషల్’ సినిమాల జాబితాలోకి చేరిపోతుంది. హీరో పాత్ర చిత్రణలో అయ్యప్ప మాలధారణ.. 41 రోజుల దీక్ష.. ఇరుముడి లాంటి అంశాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఇందులో అసలు కథ వాటితో ముడిపడింది కాదు. సాధారణంగా మన ఫిలిం మేకర్స్ చర్చించడానికి సంకోచించే లైంగిక వేధింపుల అంశం ఈ కథకు మూలం. కానీ ఎఫెక్టివ్ గా చెబితే.. ఆ టాపిక్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని.. సందేశం ప్రభావవంతంగా జనాలకు చేరుతుందనడానికి ‘ఇరుముడి’ రుజువుగా నిలుస్తుంది. ముందే అన్నట్లు ‘ఇరుముడి’ రకరకాల ఎమోషన్లతో ముడిపడ్డ సినిమా. శివ నిర్వాణ చాలా నిజాయితీగా చెప్పిన కథ. స్టోరీకి తగ్గట్లే సినిమా అంతా చాలా సీరియస్ గా నడుస్తుంది. రవితేజ సినిమా కదా అని.. ఎలివేషన్లు.. రొటీన్ పాటలు.. ఫైట్లు.. కామెడీ అంటూ మసాలాలు అద్దే ప్రయత్నం చేయకుండా ప్రతిదీ కథ ప్రకారమే నడుస్తుంది. సినిమాలో అక్కడక్కడా కొంచెం స్లో అనిపిస్తుంది. కానీ వేస్ట్ సీన్లు అంటూ కనిపించవు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమాకు ప్రాణం. దాని నేపథ్యంలో డ్రామా బాగా రక్తి కట్టింది. దీంతో పాటు భక్తి సన్నివేశాలు.. కొన్ని థ్రిల్లింగ్ సీన్లు.. మెసేజ్ కూడా వర్కవుట్ అయ్యాయి. కుటుంబ ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు.. వాళ్ళను ప్రేమించే వాళ్లకు అయితే ఇరుముడి విపరీతంగా నచ్చేస్తుంది. ఎంగేజింగ్ కథాకథనాలతో సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చిన సినిమాగా ‘ఇరుముడి’ నిలుస్తుంది.

నటీనటులు: రవితేజ ఫిల్మోగ్రఫీలో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. ఇమేజ్ ఛట్రం నుంచి పూర్తిగా బయటికి వచ్చి ఇలాంటి కథను చేయడం అభినందనీయం. మాస్ చిత్రాల మూసలో మరుగున పడిపోయిన రవితేజలోని పెర్ఫామర్ ను ఈ సినిమాలో చూడొచ్చు. త్రినాథ్ పాత్రను నరనరాన ఎక్కించుకుని అతను ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా చివరి అరగంటలో రవితేజ నటన అసామాన్యం. త్రినాథ్ పాత్రలో రవితేజను ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుంచుకునేలా తన పెర్ఫామెన్స్ సాగింది. రవితేజకు జోడీగా సగటు మధ్య తరగతి ఇల్లాలి పాత్రకు ప్రియ భవానీ శంకర్ బాగా కుదిరింది. ఆమెకు కథలో మరీ ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో బాగా పెర్ఫామ్ చేసింది. ఇక రవితేజతో సమానంగా ఇంపాక్ట్ వేసేది.. తన కూతురి పాత్ర చేసిన నక్షత్ర. మణికంఠ పాత్ర కోసం ఈ అమ్మాయిని ఎంచుకోవడమే శివ నిర్వాణ సాధించిన అతి పెద్ద సక్సెస్. అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. తన హావభావాలు కట్టిపడేస్తాయి. తన పాత్ర కదిలించేస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ రమేష్ ఇందిర కీలక పాత్రలో రాణించాడు. గురుస్వామిగా సాయికుమార్ గుర్తుండిపోయేలా నటించాడు. స్వశిక నెగెటివ్ రోల్ లో మెప్పించింది. అజయ్ ఘోష్.. మీసాల లక్ష్మణ్.. రమణ భార్గవలతో పాటు సహాయ పాత్రలు చేసిన నటులంతా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం: జి.వి.ప్రకాష్ కుమార్ పాటలు బావున్నాయి. యాలాలో పాట గుర్తుండిపోతుంది. రెండు అయ్యప్ప పాటలు ఓకే అనిపించినా.. ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమాకు బలం చేకూర్చింది. కీలక సన్నివేశాల్లో స్కోర్ ఎఫెక్టివ్ గా సాగింది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం చాలా బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మైత్రీ వారి నిర్మాణ విలువలకు ఏమీ ఢోకా లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రచయిత-దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలతో అసలు పోలిక లేని విధంగా.. తెలుగులోనూ ఒక భిన్నమైన సినిమాగా ‘ఇరుముడి’ని మలిచాడు. రచన దగ్గరే తన బలాన్ని చూపించిన శివ.. టేకింగ్ లోనూ మెప్పించాడు. ట్రైలర్లో వినిపించిన ‘‘నాకో బలహీనత ఉంది..’ డైలాగ్ కు తోడు సంభాషణల్లో మెరుపులున్నాయి. ఐతే డైలాగుల్లో కానీ.. సన్నివేశాల్లో కానీ.. ఎక్కడా ఓవర్ బోర్డ్ వెళ్లలేదు. కథలో కీలకమైన ట్విస్టును ప్లేస్ చేసిన తీరు.. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే శివ ప్రత్యేకతను చాటుతాయి. మెలోడ్రామా లేకుండా జెన్యూన్ ఎమోషన్లతో సెంటిమెంటు సీన్లను అతను పండించిన తీరు కూడా ప్రశంసనీయం.

చివరగా: ఇరుముడి.. డ్రామా బలంగా.. మెసేజ్ హృద్యంగా

రేటింగ్-3.25/5

Tags:    

Similar News