మాస్ చాలూ.. నానికి ఇప్పుడు ఇదే కావాలా!

కాకపోతే మూడో సినిమా కోసం ఇప్పుడే ఏ కథను రెడీ చేయడం లేదని శివ క్లియర్ చేశారు. నానితో మళ్లీ చేయాలంటే ముందుగా కథ తనకే విపరీతంగా నచ్చాలని చెప్పారు.

Update: 2026-08-21 13:30 GMT

నాని కెరీర్‌లో ఇప్పుడు మాస్ సినిమాల హవా కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ‘దసరా’తో మొదలైన ఆ మార్పు ‘హిట్ 3’ వరకు వచ్చింది. ‘ది ప్యారడైజ్’లో అయితే లుక్ నుంచి క్యారెక్టర్ వరకు ఇంకా రఫ్‌గా కనిపించబోతున్నాడు. ఇలాంటి టైమ్‌లో నాని నుంచి మళ్లీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తే బాగుంటుందని దర్శకుడు శివ నిర్వాణ చెప్పడం ఆసక్తిగా మారింది. అది తానే చేస్తానని మాత్రం ఇంకా చెప్పలేదు.

నాని, శివ నిర్వాణ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. శివ తొలి సినిమా ‘నిన్ను కోరి’ నానితోనే వచ్చింది. ప్రేమకథలో ఎమోషన్‌ను బాగా పట్టుకోవడంతో ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘టక్ జగదీష్’ చేశారు. అది ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. అయినా ఇద్దరి మధ్య బాండింగ్ మాత్రం అలాగే ఉందని శివ చెప్పారు. కథ ఉంటే ఒక్క ఫోన్ కాల్‌తో నాని దగ్గరకు వెళ్లగలనన్నారు.

కాకపోతే మూడో సినిమా కోసం ఇప్పుడే ఏ కథను రెడీ చేయడం లేదని శివ క్లియర్ చేశారు. నానితో మళ్లీ చేయాలంటే ముందుగా కథ తనకే విపరీతంగా నచ్చాలని చెప్పారు. ‘వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా ఇదే కావాలి’ అనే ఫీలింగ్ వచ్చినప్పుడే నానికి వినిపిస్తానన్నారు. అంటే రెండు సినిమాలు చేశాం కాబట్టి మూడోది కూడా చేయాలనే తొందర ఆయనలో కనిపించడం లేదు.

నాని ఏ రకమైన కథనైనా చేయగల నటుడని కూడా శివ చెప్పారు. కథల విషయంలో ఆయన ఆలోచన చాలా తెలివిగా ఉంటుందని అన్నారు. వరుసగా ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ లాంటి సినిమాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే సినిమా చేస్తే బాగుంటుందనేది శివ అభిప్రాయం. నిజానికి ‘హాయ్ నాన్న’, ‘అంటే సుందరానికీ’ లాంటి సినిమాల్లో నాని ఆ జోన్‌లో ఎంత కంఫర్ట్‌గా ఉంటాడో ఇప్పటికే చూశారు.

అయితే ఒక హీరో వరుసగా ఒకే తరహా సినిమాలు చేస్తే తర్వాత చిన్న మార్పు కూడా కొత్తగా కనిపిస్తుంది. నాని ఇప్పుడు మాస్, యాక్షన్ వైపు కొంత దూరం వెళ్లాడు. ‘ది ప్యారడైజ్’ తర్వాత వెంటనే మరో రఫ్ క్యారెక్టర్ కంటే మంచి ఎమోషనల్ ఫ్యామిలీ కథ పడితే ప్రేక్షకులకు కూడా ఫ్రెష్‌గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. శివ మాట కూడా దాదాపు అదే వైపు ఉంది. కానీ ఆ సినిమా శివతోనే వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. నానికి సరిపోయే కథ తనకు తట్టిన రోజే వెళ్లి చెబుతానని అన్నారు.

Tags:    

Similar News