ఫెడ‌రేష‌న్ చొర‌వ‌తో డ్యాన్స‌ర్ల స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చిన‌ట్టేనా?

కొద్ది రోజులుగా డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ లో ముస‌లం గురించి టాలీవుడ్ లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-08-21 13:02 GMT

కొద్ది రోజులుగా డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ లో ముస‌లం గురించి టాలీవుడ్ లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌ర్గ విభేధాలు ప్ర‌ధానంగా హైలైట్ అవ్వ‌డంతో దీనిపై చాలా విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ సంద‌ర్భంగా అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయ‌గా, ఈ స‌మావేశం అనంతరం అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సంస్థాగత పటిష్టత, డాన్సర్స్ యూనియన్ వివాదం, కార్మికుల వేతనాల పెరుగుదల.. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ నిధులపై ఫెడరేషన్ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

గత కొద్దికాలంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన డాన్సర్స్ యూనియన్ సమస్యపై సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఇండస్ట్రీ పెద్దలైన చిరంజీవి, బాలకృష్ణ, చదలవాడ శ్రీనివాస్, ప్రసన్న కుమార్ వంటి వారి సమక్షంలో జానీ మాస్టర్- యూనియన్ అధ్యక్షురాలితో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేశారు. కేవలం సెక్రటరీ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించి.. మిగతా కార్యవర్గంతో కలిసి పనిచేయడానికి రాతపూర్వక అంగీకారం తెలిపినా దాన్ని ధిక్కరిస్తూ ఏకపక్షంగా సొంతంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది.

ఈ క్రమంలో ఫెడరేషన్ .. చాంబర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ప్రస్తుత డాన్సర్స్ యూనియన్ కార్యవర్గానికి అలాగే వారికి మద్దతుగా ఉన్న జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ తరఫున పూర్తి స్థాయి `సహాయ నిరాకరణ` అమలు చేయాలని తీర్మానించారు. జానీ మాస్టర్‌పై ఉన్న సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నామని.. గతంలో ఆయన ఫెడరేషన్‌కు ఇచ్చిన రూ. 3.5 లక్షల విరాళాన్ని కూడా తిరిగి చెక్కు రూపంలో వెన‌క్కి పంపించనున్నట్లు తేల్చి చెప్పారు. అయితే నాయకులు చేసిన తప్పుల వల్ల సాధారణ డాన్సర్లు నష్టపోకూడదని... ఫెడరేషన్‌ను గౌరవించే సభ్యులకు అండగా ఉంటూనే షూటింగ్‌లకు ఎలాంటి విఘాతం కలగకుండా మిగతా 23 యూనియన్లు నిర్మాతలకు సహకరిస్తాయని స్పష్టం చేశారు.

మరోవైపు సినీ కార్మికుల వేతనాల పెంపుదల అంశంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 12 వరకు సమయం కోరారని.. ఈలోగా పెరగాల్సిన వ్యత్యాసపు మొత్తాన్ని ఆర్డర్ రూపంలో ఇచ్చేందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. దీనితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం ప్రకటించిన జీవో ప్రకారం... సినిమా టికెట్ల రేట్ల పెంపు ద్వారా వచ్చేదానిలో 20శాతం సంక్షేమ నిధిని వెంటనే ఫెడరేషన్ అకౌంట్‌లో జమ చేయాలని నిర్మాతలను కోరారు.

ఈ నిధులు సకాలంలో అందితేనే కార్మికులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా - ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అందించడం సాధ్యమవుతుందని వల్లభనేని అనిల్ కుమార్ వివరించారు. మొత్తం మీద ఫెడరేషన్ తన క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడబోదని హెచ్చరిస్తూనే... సాధారణ కార్మికుల హక్కులు, వేతనాలు, సంక్షేమ నిధుల సాధన కోసం పట్టుదలతో పనిచేస్తామని ఈ సమావేశం ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

Tags:    

Similar News