నటి అషురెడ్డి కేసు.. మీడియాకు టీ హైకోర్టు కీలక ఆదేశాలు

నటిగా సుపరిచితులు అషురెడ్డికి సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ లో ఒక ఫిర్యాదు రావటం.. దానిని పోలీసులు కేసు కట్టటం తెలిసిందే.;

Update: 2026-05-01 05:13 GMT

నటిగా సుపరిచితులు అషురెడ్డికి సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ లో ఒక ఫిర్యాదు రావటం.. దానిని పోలీసులు కేసు కట్టటం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మోసం చేసినట్లుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆమె తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మీడియాకు.. కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అషురెడ్డి గురించి అవమానకరంగా.. అవాస్తవ కథనాలు ప్రసారం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఆమె పరువు నష్టం కలిగించే అంశాల్ని ప్రచురించొద్దని కోర్టు స్పష్టం చేసింది. మీడియా సంస్థలు.. కంటెంట్ క్రియేటర్లు.. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా.. ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు.. పోస్టులు పెట్టొద్దని స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఇప్పటికే అప్ లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ ను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ.. తమ ఆదేశాల్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల గురించి తాజాగా నటి అషురెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. కోర్టు ఆదేశాల్ని గౌరవించాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

తన ప్రైవసీకి భంగం వాటిల్లేలా మీడియా వ్యవహరించొద్దని.. ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను తొలగించాలని కోరారు. కొత్తవి పబ్లిష్ చేయొద్దన్న ఆమె.. తనకు మద్దతు ఇస్తున్న వారికి ధన్యవాదాలని.. అదే సమయంలో నిబంధనల్ని పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    

Similar News