పెద్దిపై పర్సెంటేజ్ సిస్టమ్ ఎఫెక్ట్ పడనుందా? మైత్రీ ప్లాన్ ఏంటి?
ఆ అంశంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లతో ఎగ్జిబిటర్స్ చర్చలు జరిపారు. ఏసియన్ ఫిలిమ్స్, ఎస్వీసీ, గీతా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు ఆ విధానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ చర్చ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సింగిల్ థియేటర్స్ ను రన్ చేసేందుకు ఇబ్బందులు నెలకొన్న విషయంలో ఎగ్జిబిటర్స్ ఆ విధానాన్ని తిరిగి అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే భారీ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దిపై ఆ సిస్టమ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే పర్సంటేజ్ సిస్టమ్ ప్రకారం, సినిమా వసూళ్లలో భాగాన్ని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పంచుకుంటారు. ప్రస్తుతం అమలులో ఉన్న రెంటల్ సిస్టమ్ లో అయితే థియేటర్ యజమానికి ముందే ఒక స్టేబుల్ రెంట్ మాత్రమే లభిస్తుంది. సినిమా ఎంత వసూలు చేసినా ఎక్స్ ట్రా ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలకే చెందుతుంది. దీంతో చిన్న సినిమాలు ఆడినప్పుడు థియేటర్లకు గిట్టుబాటు కాకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోని 23 సింగిల్ థియేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై తాము పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని ఛాంబర్ కు స్పష్టం చేశాయి. మొదటి వారంలో 60%, రెండో వారంలో 50%, మూడో వారంలో 40% షేర్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ నిర్ణయం ఏప్రిల్ 3 నుంచే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
ఆ అంశంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లతో ఎగ్జిబిటర్స్ చర్చలు జరిపారు. ఏసియన్ ఫిలిమ్స్, ఎస్వీసీ, గీతా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు ఆ విధానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్స్ ప్రారంభం నుంచే పర్సంటేజ్ సిస్టమ్ కు మద్దతుగా నిలుస్తోంది. తాము విడుదల చేయబోయే టాక్సిక్ సినిమాను కూడా ఇదే విధానంలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.
అయితే మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తమ భారీ చిత్రం పెద్దిని పర్సంటేజ్ సిస్టమ్ లో విడుదల చేస్తే హైదరాబాద్ వంటి కీలక మార్కెట్లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట. తెలుగు సినిమాలకు హైదరాబాద్ సిటీ మెయిన్ రెవెన్యూ సోర్స్ గా ఉండటంతో, అక్కడ 23 థియేటర్లు ఆ విధానాన్ని అనుసరించడం పెద్ద సినిమాలకు సవాల్ గా మారొచ్చు!
ఇక ఎగ్జిబిటర్స్ మాత్రం వేరే కోణంలో వాదిస్తున్నారు. మంచి టాక్ వచ్చిన సినిమాలకు వసూళ్లు భారీగా ఉంటాయని, అప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా నష్టం ఉండదని అంటున్నారు. అంతేకాకుండా, ఆ మార్పు అవసరమని స్పష్టం చేస్తున్నారు. దీంతో మైత్రీ ప్లాన్ ఎలా ఉందోనని చర్చ జరుగుతుండగా.. అక్కడి నుంచి వస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పెద్ది విడుదలను రెండు వారాలు వాయిదా వేయగలమని, అలా చేస్తే థియేటర్ యజమానులే తమ వద్దకు వస్తారని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమా వదులుకునే పరిస్థితి ఉండదన్నది వారి లెక్క. మొత్తంగా చూస్తే, పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ సిస్టమ్ మధ్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. రాబోయే పెద్ది వంటి భారీ చిత్రాల విడుదల సమయానికి ఆ వివాదం ఎలా మలుపు తిరుగుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.