9 ఏళ్ల తర్వాత చియాన్ విక్రమ్ మూవీకి మోక్షం!
ఈ చిత్రంలో విక్రమ్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటించగా.. వినాయకన్, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ వంటి దిగ్గజ తారాగణం కీలక పాత్రలు పోషించారు.;
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గత కొన్నేళ్లుగా ఊహించని ఆర్థిక, న్యాయ వివాదాల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోయిన సంగతి తెలిసిందే. క్లాసిక్ సినిమాలను తెరకెక్కించడంలో మేటి ప్రతిభావంతుడిగా గుర్తింపు ఉన్నా చేపట్టిన ప్రాజెక్టుల ఆలస్యం ఆయనను బ్యాక్ బెంచీకే పరిమితం చేశాయి. ముఖ్యంగా చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ రూపొందించిన ప్రతిష్టాత్మక స్పై థ్రిల్లర్ `ధ్రువ నక్షత్రం` ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. అడ్డంకులు దాటలేక ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితమైంది. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ కేసును విచారించిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి జూన్ 15వ తేదీన లేదా అంతకంటే ముందే సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మార్గాన్ని సుగమం చేశారు. ఇన్వెస్టర్లు కె. పున్నియమూర్తి, కె. ప్రేమ్ కుమార్ తమకు రావలసిన బకాయిల విషయంలో సానుకూలంగా స్పందించడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే పారదర్శకత కోసం ఒక ప్రత్యేక ఆర్థిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీనివల్ల గౌతమ్ మీనన్ తదుపరి దశ పనులను వేగవంతం చేసే అవకాశం దక్కింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం... `కొండాడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్` పేరుతో ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. సినిమా ద్వారా వచ్చే ఆదాయం అంతా ఈ ఖాతా ద్వారానే జరగాలి. అంతేకాకుండా.. ఆదాయం- ఖర్చులను పర్యవేక్షించడానికి ఒక న్యాయవాదిని కూడా నియమించాలని కోర్టు ఆదేశించింది. భాగస్వాములకు ఎలాంటి జీతాలు లేదా లాభాల వాటాలు కోర్టు అనుమతి లేకుండా ఇవ్వకూడదని కఠినమైన షరతులు విధించింది. ఈ నిబంధనల వల్ల ఇన్వెస్టర్లకు భరోసా కలగడంతో విడుదల ప్రక్రియ సజావుగా సాగనుంది.
వాస్తవానికి ఈ సినిమా ప్రయాణం 2017లో మొదలైంది. కోవిడ్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందుల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. 2023లో చిత్రీకరణ పూర్తయి అదే ఏడాది నవంబర్ 24న విడుదల కావాల్సిన సినిమాను ఆర్థిక వివాదాల వల్ల చివరి నిమిషంలో నిలిపివేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2024లో కూడా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గౌతమ్ మీనన్ పాత బకాయిలను క్లియర్ చేసి.. పంపిణీదారులతో చర్చలు జరిపి త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటించగా.. వినాయకన్, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ వంటి దిగ్గజ తారాగణం కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అభిమానులకు.. విక్రమ్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ జూన్ 15 గడువు లోపు సాంకేతిక కారణాల వల్ల విడుదల సాధ్యం కాకపోతే.. తిరిగి కోర్టును ఆశ్రయించి పొడిగింపు కోరే వెసులుబాటును కూడా న్యాయస్థానం కల్పించింది.
ఆలస్యం ప్రభావం అలా ఉంటుంది:
ఏళ్ల తరబడి వాయిదా పడటం అనేది ఏ సినిమాకైనా ఒక పెద్ద సవాలే, ఎందుకంటే కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచులు మారిపోవడం లేదా సాంకేతికంగా ఆ సినిమా పాతబడినట్లు అనిపించే ప్రమాదం ఉంటుంది. అయితే `ధ్రువ నక్షత్రం` వంటి చిత్రాలకు గౌతమ్ మీనన్ మార్క్ మేకింగ్ .. విక్రమ్ లాంటి నటుడికున్న తిరుగులేని క్రేజ్ వల్ల అంచనాలు అలాగే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు విడుదలైనప్పుడు మొదటి రెండు రోజులు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. కానీ సినిమా దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే మాత్రం కంటెంట్ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా చాలా బలంగా ఉండాలి. లేనిపక్షంలో ఆ ఆలస్యం వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కచ్చితంగా ఉంటుంది.