ఎవరు మంచోళ్ళు.. ఎవరు మోసగాళ్లు? తేజ 'ట్రైటర్స్'

తేజ సజ్జా అంటే ఇప్పటివరకు హీరోగా, సూపర్ హీరోగా చూశాం. కానీ ఇప్పుడు ఆయనలో మరో యాంగిల్ బయటకు రాబోతోంది.

Update: 2026-10-06 12:55 GMT

తేజ సజ్జా అంటే ఇప్పటివరకు హీరోగా, సూపర్ హీరోగా చూశాం. కానీ ఇప్పుడు ఆయనలో మరో యాంగిల్ బయటకు రాబోతోంది. చేతిలో గన్ లేదు.. సూపర్ పవర్స్ లేవు.. కానీ మాటతోనే ఆటను నడిపించబోతున్నారు. అదే ది ట్రైటర్స్ రియాలిటీ షో. తేజ సజ్జా తొలిసారి రియాలిటీ షో హోస్ట్‌ గా మారిన ది ట్రైటర్స్ ట్రైలర్‌ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. రహస్య గుర్తింపులు, మోసం, స్నేహాలు, అనుమానాలు, వ్యూహాలతో సాగే ఆ గేమ్ షో ట్రైలర్ హైప్ పెంచుతోంది.

ముఖ్యంగా తేజ సజ్జా హోస్టింగ్ స్టైల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది షోగా మారుతోంది. "ప్రపంచంలో అందరూ మంచోళ్ళు. మోసం చేసే అవకాశం రానంతవరకు. ప్రేమ కోసం.. అధికారం కోసం.. యుద్ధం కోసం.. యుగాలు మారినా కారణాలు ఏమైనా మోసం మాత్రం మారలేదు" అంటూ తేజ చెప్పే డైలాగ్‌ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆయన లుక్, వాయిస్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇప్పటివరకు చూసిన తేజ సజ్జాకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు.

ఆ షోలో మొత్తం 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద, నటులు హర్షవర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుత్ రామన్, విష్ణు ఒయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనిష చౌదరి, స్వీకర్, ఆషిక పదుకొనే, వర్ష డిసౌజా, ప్రణవ్ అలియాస్ అభినవ కవి, ఎస్ ఎస్ వర్ధన్, రాహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ్, ఫాల్గుణి బండేరా ఇందులో పోటీపడుతున్నారు.

అయితే ఆ గేమ్‌ లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. అందరూ ఒకే టీమ్ కాదు. కొంతమంది ఇన్నోసెంట్స్ గా ఉంటే.. మరికొందరు ట్రైటర్స్ గా ఉంటారు. తమ మధ్య దాక్కున్న మోసగాళ్లు ఎవరో ఇన్నోసెంట్స్ కనిపెట్టాలి. మరోవైపు ట్రైటర్స్ మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఆట కొనసాగించాలి. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని అనుమానించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ గేమ్‌ లో టాలెంట్ కంటే తెలివి, పరిశీలన, వ్యూహం చాలా ముఖ్యం.

ఎవరి మాట వెనుక ఏ ప్లాన్ ఉందో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరితో కలవాలి.. ఎవరిని నమ్మాలి.. ఎవరిపై అనుమానం వ్యక్తం చేయాలనేది గేమ్‌ను మార్చేస్తుంది. అందుకే ప్రతి ఎపిసోడ్‌ లో కూడా కొత్త ట్విస్ట్ ఉండేలా షోను రూపొందించారు. మరోవైపు తేజ సజ్జా హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇప్పటివరకు సినిమాల్లో హీరోగా కనిపించిన ఆయన.. ఈసారి కంటెస్టెంట్ల ఆటను గమనిస్తూ, సరైన సమయంలో తన మాటలతో మరింత ఉత్కంఠ పెంచబోతున్నారు.

హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఆ ఫార్మాట్‌ కు తెలుగు వెర్షన్‌ లో తేజ సజ్జా కొత్త లుక్ తీసుకొచ్చారు. 10 ఎపిసోడ్లుగా రూపొందిన ది ట్రైటర్స్ అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. మరి హీరోగా అలరించిన తేజ.. ఇప్పుడు హోస్ట్‌ గా ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.



Tags:    

Similar News