అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్.. శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే టాలెంట్ హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన చిత్రంతో థియేటర్లలోకి వస్తున్నారు.
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే టాలెంట్ హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన చిత్రంతో థియేటర్లలోకి వస్తున్నారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కామ్రేడ్ కల్యాణ్'. అక్టోబర్ 9న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు తాజాగా మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఊహించని వినోదం ఉండబోతుందని ఆయన చెప్పిన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లోనూ కడుపుబ్బా నవ్విస్తాం:
సాధారణంగా నక్సలిజం అనగానే సీరియస్ డ్రామాలు, యాక్షన్ సీన్లే గుర్తుకొస్తాయి. కానీ 'కామ్రేడ్ కల్యాణ్' మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని శ్రీవిష్ణు స్పష్టం చేశారు. ఎక్కడ కూడా మేము ఫన్ కావాలని చేసినట్టు ఉండదు ..మూవీ లో మేము వున్నా పరిస్థితులే నవ్వు తెప్పిస్తాయి..ఈ సీరియస్ నేపధ్యంలోనూ భీభత్సమైన కామెడీ పండించామని, థియేటర్లలో ప్రేక్షకులు నవ్వి నవ్వి అలిసిపోతారని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి డిఫరెంట్ జోనర్‌లో నవ్వులు పూయించడం చాలా రేర్ అని, సినిమా చూశాక అందరూ వంద శాతం నవ్వుకుంటూ బయటికి వస్తారని భరోసా ఇచ్చారు.
అడవిలో షూటింగ్.. నడకలే నడకలు:
సినిమాకు నేచురల్ లుక్ తీసుకురావడం కోసం గ్రాఫిక్స్ కాకుండా నిజమైన అడవుల్లోనే షూటింగ్ జరిపినట్లు శ్రీవిష్ణు తెలిపారు. అయితే ఆ దట్టమైన అడవిలో షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం అంత తేలికైన విషయం కాదన్నారు. కారవాన్ పార్క్ చేసిన చోటు నుంచి లొకేషన్‌కు చేరుకోవడానికి ప్రతిరోజూ దాదాపు 45 నిమిషాలు నడవాల్సి వచ్చేదని చెప్పారు. కేవలం తామే కాకుండా సీనియర్ నటులు సైతం ప్రతిరోజూ అలా నడుచుకుంటూనే లొకేషన్‌కు వెళ్లేవారని, ఫైటింగ్ సీన్ల కంటే ఈ నడకలే చాలా కష్టమనిపించాయని సరదాగా గుర్తుచేసుకున్నారు.
భారీ తారాగణం.. అక్టోబర్ 9న దసరా కానుకగా:
మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్ అందించిన కథకు, భాను భోగవరపు మరియు నందు సవరిగాన అద్భుతమైన స్క్రిప్ట్ తోడు కావడంతో సినిమా అట్టహాసంగా వచ్చిందని శ్రీవిష్ణు ప్రశంసించారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సీరియస్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా ఫన్ జోనర్‌లోకి మార్చి కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీవిష్ణు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కష్టపడి చేసిన ఈ రియాలిటీ లొకేషన్ షూటింగ్, సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9న థియేటర్లలో నవ్వుల విందు పంచడానికి వస్తోన్న 'కామ్రేడ్ కల్యాణ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే..