విద్యుత్ జమ్వాల్.. టైగర్ ష్రాఫ్‌ సరే.. వేర్ ఈజ్ సుధీర్ బాబు?

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాలకు సుధీర్ బాబు శరీరాకృతి, అత‌డి కిల్ల‌ర్ లుక్స్ ఎంతో ప్లస్ అవుతాయి.

Update: 2026-10-06 09:50 GMT

బాలీవుడ్‌లో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నా.. స్వశక్తి, అసాధారణ హార్డ్‌వర్క్, ప్రత్యేక నైపుణ్యాలతో ఎదిగిన హీరోలంటే టక్కున విద్యుత్ జమ్వాల్, టైగర్ ష్రాఫ్ పేర్లు గుర్తుకొస్తాయి. నిజమైన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌తో హిందీ చిత్రసీమలో యాక్షన్ స్టార్లుగా వీరు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ స్థాయిలో నిజమైన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ ఉన్న హీరోలు టాలీవుడ్‌‌లో లేరా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. బాక్సాఫీస్ లెక్కలు, మాస్ ఇమేజ్ పక్కన పెడితే.. విద్యుత్ జమ్వాల్, టైగర్ ష్రాఫ్ రేంజ్‌లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రియల్ యాక్షన్ హీరో మన తెలుగులో ఎవరున్నారు? అంటే టక్కున గుర్తొచ్చే ఏకైక పేరు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.

ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్ నుంచి సుధీర్ బాబు కేవలం ఒక నటుడే కాదు..అద్భుతమైన మార్షల్ ఆర్టిస్ట్ - బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అత‌డి ఫిజిక్, పర్ఫెక్ట్ లుక్స్ ఏ హాలీవుడ్ యాక్షన్ హీరోకి తక్కువ కావు. ముఖ్యంగా హిందీలో వచ్చిన `బాఘీ` చిత్రంలో టైగర్ ష్రాఫ్‌కు దీటుగా అత‌డు చూపించిన విలనిజం, యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టైగర్ లాంటి అగ్రశ్రేణి యాక్షన్ హీరోతో పోటాపోటీగా నిలబడి... తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను తెరపై ప్రదర్శించిన ఘనత పూర్తిగా సుధీర్ బాబుదే. ఈ విషయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేరు.

తాజాగా విద్యుత్ జమ్వాల్ `స్ట్రీట్ ఫైటర్` అనే హాలీవుడ్ చిత్రంలో `ధల్సిమ్` పాత్ర కోసం ఏకంగా 15 నిమిషాలు శ్వాస బిగపట్టి ట్రాన్స్‌లోకి వెళ్లడం వంటి సాహసాలతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. ఇలాంటి స్ట్రీట్ ఫైటర్ తరహా హై-ఓల్టేజ్ యాక్షన్ సినిమాలు లేదా పాన్-వర‌ల్డ్ ప్రాజెక్ట్‌లను భారతదేశంలో తెరకెక్కిస్తే.. అందులో మన తెలుగు తేజం సుధీర్ బాబుకు కచ్చితంగా ప్రధానమైన స్థానం.. తగిన స్కోప్ ఇవ్వాలి. అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా లేక మరే ఇతర పరిశ్రమ అయినా సరే... గ్లోబల్ రేంజ్ యాక్షన్ సినిమాలకు అత‌డు వందశాతం సరిపోతారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాలకు సుధీర్ బాబు శరీరాకృతి, అత‌డి కిల్ల‌ర్ లుక్స్ ఎంతో ప్లస్ అవుతాయి. ఒకప్పుడు పవన్ కల్యాణ్, ఆ తర్వాత సుధీర్ బాబు మాత్రమే టాలీవుడ్‌లో తమ రియల్ మార్షల్ విద్యల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. కానీ నేడు టాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవెల్‌లో ఒక మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరోని ప్రొజెక్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రోజువారీ యాక్షన్ వర్కౌట్లు, స్టంట్స్‌పై పూర్తి పట్టున్న సుధీర్ బాబుకు సరైన కథ పడితే అత‌డి రేంజ్ ఎక్కడికో వెళ్తుంది.

అందువల్ల ఇకనైనా మన మేకర్స్ కేవలం రొటీన్ కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా.. సుధీర్ బాబు లాంటి అసాధారణ ప్రతిభ ఉన్న నటులను పాన్-వర‌ల్డ్‌ యాక్షన్ ఫ్రాంచైజీల్లో భాగం చేయాలి. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న `స్ట్రీట్ ఫైటర్` తరహా సినిమాల్లో విద్యుత్ జమ్వాల్ పక్కన లేదా వారితో సమానంగా నిలబడే సత్తా ఉన్న సుధీర్ బాబు లాంటి టాలెంటెడ్ హీరోలను సరిగ్గా ఉపయోగించుకుంటే తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు.

జ‌మ్వాల్ ది గ్రేట్: 15ని.లు ఊపిరి ఆపేసాడు!

హాలీవుడ్ చిత్రం `స్ట్రీట్ ఫైటర్` ట్రైలర్ లాంచ్ వేడుకలో యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ చేసిన విన్యాసం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా అత‌డు ఎలాంటి కదలిక లేకుండా ఏకంగా 15 నిమిషాల పాటు కళ్లు తెరిచి ఉంచి- శ్వాస బిగపట్టి ట్రాన్స్‌లోకి వెళ్లడంతో అక్కడ ఉన్న మీడియా, ప్రేక్షకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కొద్దిసేపటికి అత‌డి కాళ్లు వణకడం.. కళ్లలో నీళ్లు తిరగడం చూసి అత‌డి ప్రాణాయామ సాధన ఏంటో అందరికీ అర్థమైంది.

`స్ట్రీట్ ఫైటర్` చిత్రంలో వీడియో గేమ్ ఫ్రాంచైజీకి చెందిన పాపుల‌ర్ యోగా మాస్టర్, అగ్నిని శ్వాసించే `ధల్సిమ్` పాత్రలో నటిస్తున్న జ‌మ్వాల్ యోగా - కలరిపట్టులో ఉన్న తన అసాధారణ నైపుణ్యంతో ఈ పాత్రకు వందశాతం న్యాయం చేశారు. ఇక ఇదే వేదికపై మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో ఎంతటి పెద్ద స్టార్ అయినా సెట్‌కు సమయానికి వస్తారని.. అక్కడ ప్రతి నిమిషానికి తగిన పారితోషికం ఇస్తారు కాబట్టి అందరూ ఎంతో క్రమశిక్షణతో పని చేస్తారని చెబుతూ హాలీవుడ్, బాలీవుడ్ పని సంస్కృతిపై జ‌మ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Full View
Tags:    

Similar News