శ్రీవిష్ణు మార్క్ కామెడీ.. కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ ఎలా ఉంది?
కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. అక్టోబర్ 9న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
యంగ్ హీరో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ కామెడీతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం నవ్వులు, యాక్షన్ తో సందడి చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ఆ చిత్రానికి జానకిరామ్ మర్ల దర్శకత్వం వహించారు.
కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. అక్టోబర్ 9న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 1990ల కాలం నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మాడుగుల గ్రామం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఆ కాలానికి తగ్గట్టుగా పీరియాడికల్ యాక్షన్కా మెడీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ లో మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది.
కళ్యాణ్ రోల్ లో శ్రీవిష్ణు తనదైన శైలిలో కనిపించారు. ఆయన చెప్పే వన్ లైనర్లు, అల్లరి మేనరిజమ్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. హీరోయిన్ మహిమా నంబియార్ ఒడిశాకు చెందిన అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ కథలో మెయిన్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక శ్రీవిష్ణు తల్లి పాత్రలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కనిపించారు. ఆమె పాత్రకు కోపం ఎక్కువగా ఉండటంతో పాటు, బాలకృష్ణకు వీరాభిమానిగా చూపించారు.
ఆ పాత్ర కూడా సినిమాలో మంచి కామెడీ పండించేలా ఉంది. అయితే ట్రైలర్ లో అసలు ట్విస్ట్ శ్రీవిష్ణు పాత్ర చుట్టూ తిరిగే నక్సలైట్ అంశం. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా కళ్యాణ్ మారడం.. అతడిని పట్టుకోవడానికి పోలీస్ అధికారి రంగంలోకి దిగడం ఆసక్తిని పెంచుతోంది. ఆ పోలీస్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు. ఆయన రోల్స్ లో నెగెటివ్ షేడ్స్ తో పాటు కామెడీ కూడా ఉండేలా కనిపిస్తోంది.
వెన్నెల కిషోర్, సత్య, సుధర్శన్ తదితరులు కూడా తమ కామెడీతో సందడి చేయబోతున్నారు. ట్రైలర్ లో వీరి పాత్రలు కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. అయితే మొత్తం ట్రైలర్ లో శ్రీవిష్ణు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. కామెడీతో పాటు యాక్షన్, ప్రేమ, విలేజ్ బ్యాక్ డ్రాప్ కలగలిపి సినిమాను రూపొందించినట్లు కనిపిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ ను ఏకంగా పలువురు టాలీవుడ్ దర్శకులు కలిసి విడుదల చేశారు.
ఆర్జీవీ, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, బీవీఎస్ రవి, నందినీ రెడ్డి, రామ్ అబ్బరాజు తదితరులు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీనిపై కోన వెంకట్ స్పందిస్తూ.. నా ఆత్మీయులు.. నా బలం.. నా వాళ్ళు అంటూ వారికి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పటికే టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి శ్రీవిష్ణు ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.